Monday, January 20, 2025

ఢిల్లీలో నియంతృత్వ పాలన సాగుతోంది

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో నియంతృత్వ పాలన సాగుతోంది
అడ్డుకోకపోతే మిగతా రాష్ట్రాల్లోనూ అర్డినెన్స్‌లు వస్తాయి
ఆప్ మహార్యాలీలో కేంద్రం తీరుపై ఆరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ధ్వజం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిన కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఢిల్లీలో కేంద్రం తొలి దాడి చేసిందని, దీన్ని అడ్డుకోని పక్షంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌లే వస్తాయని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ ధోరణిని ఇక్కడే అంతం చేయాలని, నియంతృత్వానికి ముగింపు పలికే ఉద్యమానికి ఢిల్లీనుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం రాంలీలా మైదానంలో ఆమ్ ఆదీపార్టీ నిర్వహించిన మహార్యాలీలో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘బిజెపి నన్ను అవమానించవచ్చు.. నేను పట్టించుకోను. అయితే ఢిల్లీప్రజలను అవమానిస్తే సహించను’ అని కేజ్రీవాల్ హెచ్చరించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో జనం ఈ మహార్యాలీలో పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్, ఆమ్ ఆద్మీపార్టీ సీనియర్ నాయకులతో పాటుగా రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా ఆ ర్యాలీకి హాజరయ్యారు. కేంద్రంలోని బిజెపికి రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను అంగీకరించనని ప్రధాని మోడీ అంటే దాన్ని హిట్లర్ పాలన అంటారన్నారు.

ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని ఈ ఆర్డినెన్స్ చెబుతోందన్నారు. సాక్షాత్తు లెఫ్టినెంట్ గవర్నరే ప్రజలు ఎవరికి కావాలంటే వారికి ఓటు వేసుకోవచ్చు కానీ ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెప్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ తాను దేశమంతటా పర్యటిస్తున్నానని, ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నానని ఆయన అన్నారు. భార దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల అరెస్టుగురించి మాట్లాడుతూ దేశ రాజధానిలో తాము చేస్తున్న మంచి పనులను అడ్డుకునేందుకే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమకు వందమంది సిసోడియాలు, జైన్‌లు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. బిజెపిని ప్రభుత్వాలను ఎలా కూలదోయాలో తెలిసిన భారతీయ జుగాద్ పార్టీగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ అభివర్ణించారు.

డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ బ్యారెల్: సిబల్
ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఏజన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు.‘ ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు, డబుల్ బ్యారెల్ ప్రభుత్వం. ఒక బ్యారెట్ ఇడి అయితే మరోటి సిబిఐ. ఢిల్లీని బ్యూరోక్రాట్లతో పాలించాలని కేంద్రం కోరుకుంటోంది. సిఎంకు ఏ అధికారాలు లేకుండా చేయాలనుకుంటోంది. ఇది ఎలాంటి జోక్ అనాలి?’ అని సిబల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News