న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజలు ఉచితాలకు అలవాటు పడ్డారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలు మళ్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపెట్టాయి. బుధవారం “ ఢిల్లీ 2041 న్యూ మాస్టర్ ప్లాన్ ”అనే కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రసంగిస్తూ ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఉచితాలకు అలవాటు పడ్డారని ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, విద్యుత్, రవాణా తదితర రంగాల్లో ఆప్ పభుత్వం ఉచిత పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎల్‌జి సక్సేనా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు.
కష్టజీవులైన ఢిల్లీ ప్రజలను అవమానించొద్దని మండిపడ్డారు. సక్సేనా బయటి వ్యక్తి అని, ఢిల్లీ ప్రజలను అర్థం చేసుకోలేదని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. “ ఢిల్లీ ప్రజలు కష్టజీవులు. తమ శ్రమతో ఈ నగరాన్ని తీర్చిదిద్దారు. ఎల్జీ సర్… మీరు బయటి నుంచి వచ్చారు. ఢిల్లీ గురించి, ఢిల్లీ వాసుల గురించి మీకు తెలియదు. స్థానికులను ఇలా అవమానించొద్దు” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల మాదిరి చోరీలు చేయడం లేదని, డబ్బు ఆదా చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఈ విషయంలో మీ సమస్య ఏంటి ? అని ఎల్‌జీని కేజ్రీవాల్ ప్రశ్నించారు.