ఎస్‌పి నేత స్వామి ప్రసాద్ విమర్శ
బలియా(యుపి): కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలను ముద్రించాలని సిఫార్సు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాల ప్రచారకర్తగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మారారని సమాజ్‌వాది పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు. గురువారం రాత్రి ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు భారత రాజ్యాంగం గురించి ఎటువంటి అవగాహన గాని లౌకికవాద భారత రాజ్యాంగంపై గౌరవం గాని లేవని విమర్శించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌తో కేజ్రీవాల్ దోస్తీ బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ నేర్పించిన చిలక పలుకులనే కేజ్రీవాల్ పలుకుతున్నారని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భాషనే ఆయన కూడా మాట్లాడుతున్నారని మౌర్య అన్నారు. వోట్ల కోసం కేజ్రీవాల్ ఎంతటి నీచానికైనా దిగజారుతారని, ఆయనకు సద్బుద్ధి రావాలని కోరుకుంటున్నానని మౌర్య వ్యాఖ్యానించారు. దేశంలో 34 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని, ఇద్దరు దేవతామూర్తుల చిత్రాలను మాత్రమే కరెన్సీ నోట్లపై ప్రభుత్వం ముద్రిస్తే మిగతా దేవుళ్ల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ఇతర మత పెద్దల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు.