ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ముఖ్యమంత్రి బంగళాను ఖాళీ చేయనున్నారు. ఢిల్లీలోని లుటియన్స్‌లో ఉన్న ఒక ఎంపీ బంగళాలోకి కేజ్రీవాల్ మారనున్నట్లు ఆప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ తన కుటుంబంతో కలసి పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్‌కు కేటాయించిన బంగళాలో నివసించనున్నట్లు ఆప్ తెలిపింది.
రవిశంకర్ శుక్లా లేన్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయానికి అతి చేరువలో మండీ హౌస్ సమీపంలోని ఫిరోజ్‌షా రోడ్డులో అశోక్ మిట్టల్ బంగళా ఉంది. నగర పౌరుల నుంచి నిజాయితీ సర్టిఫికెట్ పొందేందుకే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ప్రజల విశ్వాసాన్ని మళ్లీ పొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపడతానని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది.