న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇడి విచారణకు గైర్ హాజరయ్యారు. ఇడి నోటీసులు చట్ట విరుద్ధమని, , పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. బిజెపి ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. సమన్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇడికి లేఖ రాశారు. తనను వ్యక్తిగత హోదాలో విచారణకు పిలిచారో, లేక ఢిల్లీ ముఖ్యమంత్రిగా లేక ఆప్ జాతీయ కన్వీనర్‌గా పిలిచారో ఇడి సమన్లలో నిర్దిష్టంగా పేర్కొనలేదని కూడా ఆయన ఆ లేఖలో ఆరోపించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారంటూ ఇడి సమన్లు జారీ చేసిన రోజునే బిజెపి ఎంపి మనోజ్ తివారీ బహిరంగంగానే ప్రకటించారని, దీన్ని బట్టి ఈ సమన్ల వెనుక బిజెపి నేతలు ఉన్నారని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ రాసిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఇడి వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో విచారణను ఆరునుంచి 8 నెలల్లోగా పూర్తి చేస్తామని ప్రాసిక్యూషన్ ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నందున దగ్గర్లో ఉన్న మరో తేదీన విచారణకు రావలసిందిగా కేజ్రీవాల్‌కు మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఇడి వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కేజ్రీవాల్‌కు అక్టోబర్ 30న ఇడి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు గైర్‌హాజరయిన కేజ్రీవాల్ .. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ రోడ్డుషోలో ఆయన పాల్గొన్నారు.