Sunday, December 22, 2024

సామాన్యునిగా జీవనం సాగించనున్న కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేసిన అర్వింద్ కేజ్రీవాల్ సామాన్యునిగా జీవనం సాగించేందుకు భద్రత సహా అన్ని ప్రభుత్వ సౌకర్యాలను వదులుకుని, 15 రోజుల్లోగా తన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం వెల్లడించింది. తన రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేయాలన్న తన నిర్ణయాన్ని ముందుగా ప్రకటించారని పార్టీ సీనియర్ నేత, ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. కేజ్రీవాల్ ఒక వారంలో 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగళాను ఖాళీ చేస్తారని సంజయ్ సింగ్ చెప్పగా, పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్, ఆయన కుటుంబం 15 రోజుల్లో ఆ పని చేస్తారని ఆప్ ఆ తరువాత స్పష్టం చేసింది.

అర్వింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబానికి సముచిత వసతి కోసం అన్వేషణ మొదలైందని సంజయ్ సింగ్ తెలిపారు. ‘నిజాయతీకి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తూ అర్వింద్ కేజ్రీవాల్ సిఎం నివాసాన్ని ఖాళీ చేస్తారు, ప్రభుత్వ భద్రత సౌకర్యానికి కూడా స్వస్తి చెబుతారు’అని ఆప్ తన అధికార ‘ఎక్స్’ మాధ్యమంలో ఒక పోస్ట్‌లో తెలియజేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తనకు కల్పించిన అధికార నివాసం, వాహనాలు, భద్రత సహా సౌకర్యాలు అన్నిటినీ కేజ్రీవాల్ వదులుకుని, ‘సామాన్యుని’లా జీవనం సాగిస్తారని సంజయ్ సింగ్ తెలిపారు. 2013లో మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేజ్రీవాల్ ఒక పాత నీలి రంగు వ్యాగన్ ఆర్‌లో ప్రయాణిస్తుండేవారు. అర్వింద్ కేజ్రీవాల్ భద్రత గురించి ఆందోళనలు ఉన్నాయని, గతంలో ఆయనపై ‘పలు మార్లు దాడులు జరిగాయి’ అని ఆప్ నేత చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News