అయోధ్య: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అయోధ్యలో రామాలయాన్ని దర్శించారు. కేజ్రీవాల్ వెంట ఆయన భార్య, తల్లితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. తన భార్య, తల్లితో కలసి అయోధ్యలోని రామాలయాన్ని, శ్రీరాముడిని దర్శించుకున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. తనతోపాటు భగవంత్ మాన్, ఆయన కుటుంబ సభ్యులు కూడా బాలరాముడిని దర్శించుకున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రగతి కోసం, మానవాళి సంక్షేమం కోసం శ్రీరాముడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అయోధ్యను కేజ్రీవాల్ సందర్శించడం ఇది రెండవసారి. 2021లో ఆయన అయోధ్యను దర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జనవరి 22న అయోధ్యలో శ్రీరామాలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి కేజ్రీవాల్ హాజరుకాలేదు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని కేజ్రీవాల్ గతంలో తెలిపారు. ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లు నడిచేలా తాను కృషి చేస్తానని కేజ్రీవాల్ తెలిపారు.
అయోధ్య బాలరాముడిని దర్శించిన కేజ్రీవాల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -