ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినది కాదు అని మంత్రి అతిశీ తెలిపారు. ఢిల్లీ జల మండలిలో జరిగిన అవకతవకలపై ఇడి సమన్లు జారీ చేయడంతో పాటు మార్చి 21న ఆయన హాజరు కావాలని పేర్కొందన్నారు.
ఢిల్లీ మద్యం స్కామ్‌లో సిఎం కేజ్రీవాల్ కు ఇడి ఇప్పటివరకు ఎనిమిది సార్లు సమన్లు పంపిన విషయం విధితమే. కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఇడి ఫిర్యాదు చేసింది. కోర్టులో విచారణకు కేజ్రీవాల్ హాజరయ్యారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ ఇడి సమన్లు జారీ చేయడంతో ఇది తొమ్మిదో సారి కావడం గమనార్హం. దీంతో ఆప్ నేతలు ఖండించారు. జలమండలికి సంబంధించిన కేసులో ఇడి సమన్లు జారీ చేసిందని ఢిల్లీ మంత్రులు స్పందించారు.
ఈ సందర్భంగా ఆఫ్ మంత్రి అతిశీ మీడియాతో మాట్లాడారు. మద్యం కేసులో అరెస్టు చేయలేమని బిజెపి భావించడంతో మరో తప్పుడు కేసును బయటకు తీసిందని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారానికి వెళ్లకుండా బిజెపి అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే కేజ్రీవాల్ ఇడి సమన్లు జారీ చేసిందని ధ్వజమెత్తారు. ఈ కేసు గురించి ఎవరికి తెలియదని, ఇది తప్పుడు కేసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.