Monday, December 23, 2024

2029 నాటికి బిజెపి ముక్త్ భారత్‌: సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన బిజెపి దాడులు చేస్తోందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని అంతం చేస్తామని చెబుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలను ఓట్లు అడగాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని సవాలు చేశారు. 2029 నాటికి బిజెపి ముక్త్ భారత్‌ను ఆప్ సాధిస్తుందని ఆయన ప్రకటించారు. విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ శాసన సభను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేయించినా తాను ఢిల్లీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని ఆయన ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలిచినప్పటికీ 2029 ఎన్నికల్లో కాషాయ పార్టీ నుంచి దేశాన్ని విముక్తం చేస్తామని ఆయన తెలిపారు. తన భవిష్యత్తు గురించి బిజెపి భయపడుతుందంటే దానికి కారణం ఆప్ మాత్రమేనని ఆయన అన్నారు.

ఈ కారణంగానే ఆప్‌ను చీల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. 12 ఏళ్ల క్రితమే ఆప్ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. దేశంలో 1350 పార్టీలు ఉన్నాయని, 2012 నవరంబర్ 26న ఆప్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుందని, ఇంత తక్కువ కాలంలోనే బిజెపి, కాంగ్రెస్ తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించిందని ఆయన చెప్పారు. తన ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి ప్రయత్నిస్తున్న కారణంగానే తాను విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టానని ఆప్ కన్వీనర్ కూడా అయిన కేజ్రీవాల్ తెలిపారు. ఓటింగ్ సందర్భంగా ఆప్‌కు చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 54 మంది సభలో హాజరుకావడంతో మూజువాణి ఓటుతో విశ్వాసన తీర్మానం ఆమోదం పొందింది. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను లోబరుచుకోవడానికి బిజెపి ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

తమను బిజెపి నాయకులు సంప్రదించిన విషయాన్ని ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు సభలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందుకు ఆధారాలు చూపాలని బిజెపి సభ్యులు అడుగుతున్నారని, ఎవరూ టేప్‌రికార్డర్‌ను వెంటపెట్టుకుని ఎల్లప్పుడూ తిరగరని ఆయన వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయితే ఆప్ ప్రభుత్వం కూలిపోతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగలరేమోకాని ఆయన ఆలోచనలను ఎలా అరెస్టు చేయగలరని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఎవరూ పార్టీ ఫిరాయించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, కొందరికి ఆరోగ్యం సరిగాలేదని, మరికొందరు నగరంలో లేరని ఆయన వివరించారు. తమ పార్టీపైన, తమ మంత్రులపైన బిజెపి దాడి చేసిన తీరును ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలను వెర్రివాళ్లుగా బిజెపి భావిస్తోందని, కాని ప్రజలు చాలా తెలివైన వారని ఆయన అన్నారు.

కేజ్రీవాల్‌ను అణచివేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారా అన్న చర్చ ప్రజలలో జరుగుతోందని, తమ మంత్రివర్గంలోని నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4ను బిజెపి అరెస్టు చేయించడంమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ఇప్పుడు నంబర్ 1ని అరెస్టు చేస్తారన్న చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. యావద్దేశంలో బిజెపికి ప్రధాన ప్రత్యర్థి ఆప్ కావడమే ఇందుకు కారణమని కేజ్రీవాల్ చెప్పారు. రామ భక్తులమని చెప్పుకునే బిజెపి నాయకులు తమ ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు మందులను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. గతంలో తనపైన చాలాసేర్లు దాడులు జరిగాయని, తనను చెంపదెబ్బ కొట్టడం, తనపై ఇంకు చల్లడం వంటివి చేశారని, ఇప్పుడు తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం గత మూడేళ్లలో మూడుసార్లు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 2022 ఆగస్టులో, 2023 మార్చిలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి నెగ్గారు. 70 మంది సభ్యులగల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బిజెపికి 8 మంది సభ్యులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News