ముంబయి: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్(23) డ్రగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్నాడు. కాగా అతడు, మరి ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులను ముంబయి ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. క్రూయిజ్ నౌక కేసులో అరెస్టయిన మరో 12 మంది కూడా బెయిల్ దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రత్యేక జడ్జీ వివి పాటిల్ ఇతర నిందితుల తరఫు వాదనలను రేపు (గురువారం) విచారించనున్నారు.
మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్‌సిబి) తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఆయన కోర్టుకు తన వాదన వినిపిస్తూ, ‘యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని తీవ్రంగా చూడాలి. దోషులు కాని అమాయకులకు నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డిపిఎస్) చట్టం వర్తించదు. ప్రస్తుత దరఖాస్తుదారుడు..అంటే ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాలను మొదటిసారి వినియోగిస్తున్నవాడేమి కాదు. అతడు కొన్ని సంవత్సరాలుగా నిషిద్ధ మాదకద్రవ్యాలను వాడుతున్నాడనేందుకు రుజువులు కూడా కోర్టుకు సమర్పించాము” అని వాదించారు. కాగా ఆర్యన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ “ ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వడం దర్యాప్తును కుటుపరుస్తుందన్న వాదనకు ఎన్‌సిబి ఎలాంటివి సమర్పించలేదు” అన్నారు.
ఇరుపక్షం వాదనలు విన్న ప్రత్యేక జడ్జీ వివి పాటిల్ తీరును రిజర్వులో ఉంచారు. ఇదిలావుండగా ఆర్యన్ ఖాన్‌కు నవంబర్ మొదటివారంలోగా బెయిల్ లభించకుంటే ఆ గడువు ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో కోర్టుకు సెలవులు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణపై ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన బదులు ఇవ్వడానికి నిరాకరించారు. ‘సత్యమేవ జయతే’ అని మాత్రం అన్నారు.