Monday, January 27, 2025

ఆస్ట్రేలియా క్వీన్ మాడిసన్..ఫైనల్లో సబలెంకకు షాక్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగినఫైనల్లో మాడిసన్ 63, 26, 75 తేడాతో టాప్ సీడ్, కిందటి విజేత అరినా సబలెంక (బెలారస్)ను ఓడించింది. కీస్ కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ సీజన్‌లో ఆరంభం నుంచే అసాధారణ ఆటతో అలరించింది. అంచనాలకు మించి రాణిస్తూ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ పోరు చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో కీస్ ఆధిపత్యం చెలాయించింది. సబలెంకను హడలెత్తిస్తూ లక్షంవైపు నడిచింది. కళ్లు చెదిరే షాట్లతో అరినాను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిలకడైన ఆటతో అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఈసారి సబలెంక దూకుడును ప్రదర్శించింది. అద్భుత ఆటతో కీస్ జోరుకు కళ్లెం వేసింది. నిలకడగా ఆడుతూ ముందుకు సాగింది. కీస్ పూర్తిగా చేతులెత్తేసింది.

సబలెంకకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. చివరి వరకు నిలకడైన ఆటతో అలరించిన సబలెంక సెట్‌ను దక్కించుకుంది. ఇక కీలకమైన మూడో సెట్‌లో మళ్లీ పోరు ఆసక్తికరంగా తయారైంది. ఈసారి సబలెంక, కీస్ సర్వం ఒడ్డారు. అద్భుత పోరాట పటిమతో అభిమానులను కనువిందు చేశారు. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడడంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. మరోవైపు చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన కీస్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక సబలెంక ఈసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. కాగా, ఈ సీజన్‌లో కీస్ ఆటను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పాలి. తొలి రౌండ్ నుంచే అద్భుతంగా ఆడింది. ఆరంభంలో కీస్ టైటిల్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ఆటతో అలరించిన కీస్ చివరి వరకు నిలకడైన ప్రదర్శనతో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని గెలుచుకుంది. గతంలో కీస్ 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరింది. అయితే అప్పట్లో తుది పోరులో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నెరవేర్చుకుంది.

సిన్నర్‌తో జ్వరేవ్ అమీతుమీ..నేడు పురుషుల తుది సమరం
ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ సమరంలో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్(ఇటలీ)తో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) అమీతుమీ తేల్చుకోనున్నాడు. సిన్నర్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్నాడు. ఇటు సిన్నర్ అటు జ్వరేవ్ అద్భుత ఆటతో టైటిల్ పోరుకు దూసుకొచ్చారు. సిన్నర్ తొలి రౌండ్ నుంచే అత్యంత నిలకడైన ఆటను కనబరిచాడు. ఏ మ్యాచ్‌లోనూ ఒత్తిడికి గురికాలేదు. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించి వరుసగా రెండోసారిఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అమెరికా ఆటగాడు బెన్ షెల్టన్‌ను అలవోకగా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు జ్వరేవ్ కూడా జోరుమీదున్నాడు. సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో జ్వరేవ్‌కు వాకోవర్ లభించింది. గాయం వల్ల నొవాక్ ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. ఈ సీజన్‌లోజ్వరేవ్ అంచనాలకు తగినట్టు రాణించాడు. టైటిల్ పోరులోనూ జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. సమవుజ్జీల మధ్య సాగే తుది సమరం అభిమానులను కనువిందు చేయడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News