Friday, November 15, 2024

విహెచ్‌పి నూతన అధ్యక్షుడిగా రవీంద్రనారాయణ్‌సింగ్

- Advertisement -
- Advertisement -

As new president of VHP Rabindra Narain Singh

 

న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషద్(విహెచ్‌పి) అధ్యక్షుడిగా రవీంద్రనారాయణ్‌సింగ్‌ను ఎన్నుకున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బీహార్‌కు చెందిన సింగ్ పద్మశ్రీ గ్రహీత. ఆర్థోపెడిక్ సర్జన్‌గా సింగ్ చేసిన సేవలకు 2010లో ఆయణ్ని పద్మశ్రీతో సత్కరించారు. సింగ్ సుదీర్ఘకాలంగా విహెచ్‌పి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రవీంద్రనారాయణ్‌సింగ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్రజైన్ తెలిపారు. విహెచ్‌పి ప్రస్తుత అధ్యక్షుడు విష్ణుసదాశివ్‌కోక్జేకు 82 ఏళ్లని, వయోభారం వల్ల తనను బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన కోరారని జైన్ తెలిపారు. సింగ్ వైద్యుడిగానేగాక మత,సామాజిక కార్యక్రమాల్లోనూ తన సేవలందించారని జైన్ తెలిపారు. సింగ్‌లాంటివ్యక్తిని ఆ పదవికి ఎంపిక చేయడం పట్ల తమకు గర్వంగా ఉన్నదన్నారు. విహెచ్‌పి నిర్వహించిన మీడియా సమావేశంలో జైన్, సింగ్‌తోపాటు ఇతర విహెచ్‌పి నేతలు పాల్గొన్నారు.

మేవాత్‌లో హిందువుల రక్షణకు విహెచ్‌పి డిమాండ్

విహెచ్‌పి ప్రధాన కార్యదర్శి పదవికి మిలింద్ పరాండేను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని జైన్ తెలిపారు. శనివారం ఉదయం ఫరీదాబాద్‌లో సమావేశమైన విహెచ్‌పి గవర్నింగ్ కౌన్సిల్, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వీరిని ఎంపిక చేశాయి. ఈ సమావేశంలో హర్యానాలోని మేవాత్ జిల్లాలో హిందువుల పరిస్థితిపై చర్చించినట్టు విహెచ్‌పి తెలిపింది. ముస్లింలు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో హిందువుల భద్రతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని విహెచ్‌పి డిమాండ్ చేసింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు చట్టం తెస్తానని, గోవధను నిరోధించే చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకూ అవి అమలు కాలేదని విహెచ్‌పి విమర్శించింది. చుట్టుపక్కల ప్రాంతాల మద్దతుతో హిందూ సమాజం స్వీయ రక్షణ ప్రారంభించిందని విహెచ్‌పి తెలిపింది. హిందూ సమాజంలో వచ్చిన ఈ చైతన్యాన్ని తాము స్వాగతిస్తున్నామని విహెచ్‌పి పేర్కొన్నది. హర్యానాలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News