Monday, January 20, 2025

లోక్‌సభలో అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ నినాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ /హైదరాబాద్/మనతెలంగాణ: లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి చేసిన నినాదాలు చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారాయి. మంగళవారంనాడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారోత్సవ క్రమంలో తెలంగాణ ఎంపిల వంతు వచ్చింది. ఆ వరుసలో అసదుద్దీన్ ఒవైసి కూడా ఎంపిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ‘జై భీమ్..జై తెలంగాణ, అల్లాహో అక్బర్, జై పాలస్తీనా’ అని నినదిస్తూ ఒవైసి వేదిక దిగి వెళ్లిపోయారు. ఆయన నినాదంలో జై పాలస్తీనా ఉండడాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన అధికార పక్ష బిజెపి సభ్యులు ఒక్క పెట్టున అభ్యంతరం వ్యక్తం చేశారు.

పలువురు మంత్రులు, బిజెపి సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ సభ్యులకు సర్దిచెప్పారు. నిబంధనల ప్రకారం వ్యవహరించి అభ్యంతరకర పదజాలం ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. దీంతో బిజెపి సభ్యులు శాంతించారు. అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ నినాదాన్ని ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విమర్శలపై అసదుద్దీన్ పార్లమెంట్ వెలుపల స్పందించారు. తన నినాదాల్లో తప్పేముందన్నారు. మిగతా వాళ్లు కూడా రకరకాల నినాదాలు ఇచ్చారని, వాటిని కూడా చూడాలన్నారు. అలాంటి నినాదం చేయకూడాదని రాజ్యాంగంలో ఎక్కడైనా నిబంధన ఉందా అని ప్రశ్నించారు. పాలస్తీనా గురించి ఒకప్పుడు గాంధీజి ఏం చెప్పారో తాను అదే చదివానని ఒవైసి పేర్కొన్నారు. తాను అణచివేతకు గురౌతున్న ప్రజల గురించి మాత్రమే నినదించానని అన్నారు.

కిషన్ రెడ్డి సహా కేంద్ర మంత్రుల ఫైర్
అసద్ జై పాలస్తీనా నినాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒవైసి నినాదాన్ని తప్పుపట్టారు. ఒక చేత్తో రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూనే మరోవైపు రాజ్యాంగ వ్యతిరేక నినాదాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీంతో అసదుద్దీన్ నిజస్వరూపం బయటపడిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మరో మంత్రి రిజిజు కూడా స్పందించారు. తాము పాలస్తీనాకు వ్యతిరేకం కాదన్నారు. ఆ దేశంతో శత్రుత్వం కూడా లేదన్నారు. ఒక సభ్యుడు మన రాజ్యాంగానికి అనుగుణంగా ప్రమాణం చేసి.. మరోదేశాన్ని పొగుడుతూ నినాదం ఇవ్వడం బాగాలేదన్నారు. నిబంధనలు చూసిన తర్వాత చర్యలు తీసుకుంటామని రిజిజు స్పష్టం చేశారు. మరో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే, అసదుద్దీన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే పాలస్తీనా వెళ్లిపో : రాజాసింగ్
అసదుద్దీన్ కామెంట్స్ పై గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియోను రిలీజ్ చేసిన రాజాసింగ్ పాలస్తీనాపై అంత ప్రేమ ఉంటే, వారి కోసం తాపత్రయం నిజం అయితే ఓవైసీ భారత్ విడిచి పాలస్తీనాకు వెళ్లి తుపాకి పట్టుకోవాలని సూచించారు. ఒక్కసారి పాలస్తీనాకు వెళితే మీ లాంటి వారి పరిస్థితి ఏంటో సరిగ్గా అర్థమఅవుతుందని కామెంట్ చేశారు. భారత దేశంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ భారత్ మాతాకీ జై, జై భారత్ అని నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు. లోక్ సభలో ప్రమాణ స్వీకారం ఏ ప్రకారం చేస్తోరో మీకు చెప్పడానికి మీరు కొత్త సభ్యులేమి కాదని ఆ అవసరం కూడా మీకు లేదన్నారు. అదే మీ స్థానంలో ఉండి ఎవరైనా జై ఇజ్రాయిల్ అంటే ఊరుకునేవారా? బయటకు వచ్చి నానా హంగామా చేసేవారు కదా అని నిలదీశారు.

నీకు ఓటేసింది పాలస్తీనియులా : బిజెపి
తెలంగాణ బిజెపి ఎక్స్ వేదికగా ఓవైసీ పై తీవ్ర విమర్శలు చేసింది. ‘కన్న తల్లికి గంజి కూడా పొయ్యనోడు, పినతల్లికి పరమాన్నం వండి పెట్టిండట. భారతమాతకు జై కొట్టడం చేతకాదు, జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడానికి చేతులురావు కాని నీ మతంతో మాత్రమే ముడిపడి ఉన్నందున పాలస్తీనాకు జై కొట్టావు, నువ్వు ఎంపి అవ్వడానికి ఓటు వేసింది భారతీయులా? పాలస్తీనీయులా? మనిషివి మాత్రం అడ్డం పొడవు పెరిగితే సరిపోదు ఒవైసీ, కొంచమైనా సిగ్గు – మానం తెచ్చుకో’ అని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News