బలియా(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటరుగా తన పేరును నమోదు చేసుకుంటే ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అభిప్రాయపడ్డారు. 2022లో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎస్‌బిఎస్‌పి ఏర్పాటు చేసిన కూటమిలో ఎంఐఎం కూడా భాగస్వామిగా చేరింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఉత్తరాఖండ్ నుంచి యుపికి వచ్చిన ఒక తెలివైన వ్యక్తి యుపి ఓటరుగా పేరు నమోదు చేసుకుని ముఖ్యమంత్రి కాగలిగారని రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా యుపిలో ఓటరుగా తన పేరు నమోదు చేసుకుంటే ఆయన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చని శుక్రవారం బలియాలో విలేకరులతో మాట్లాడుతూ రాజ్‌భర్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 20 శాతం మంది ముస్లింలు ఉన్నారని, వారి జనాభాకు అనుగుణంగా ప్రభుత్వంలో వారికి తగిన ప్రాతినిధ్యం ఉండాలని, అది వారి హక్కని ఆయన చెప్పారు. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. ముస్లిం కావడమే నేరమా అని ఆయన నిలదీశారు. జమ్మూ కశ్మీరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎప్పుడూ వేర్పాటువాదం గురించి, పాకిస్తాన్ గురించి మాట్లాడే మెహబూబా ముఫ్తితో బిజెపి ఒప్పందం కుదుర్చుకుందని ఆయన గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా..కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ బరేలీలో విలేకరులతో మాట్లాడుతూ ఎంఐఎం అధినేత ఒవైసీ, ఎస్‌బిఎస్‌పి అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Asaduddin Owaisi can become CM if become voter of UP