(ఎ.సుధాకర్ బాబు/మనతెలంగాణ)
నాంపల్లి నియోజకవర్గంలో ముస్లింలలో తిరుగులేని ఆధిపత్యంలో విజయాలు సాధిస్తున్న మజ్లీస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో హిందూ ఓట్లపై దృష్టి సారించింది. ముస్లింల ఓట్లతోనే గెలుస్తూ వస్తున్న మజ్లీస్ ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ వైఖరిని మార్చేసింది. హిందూ ఇతర వర్గాల మద్దతును కూడగట్టి.. ఎట్టిపరిస్థితుల్లో గెలవాలన్నదే లక్షంగా కనిపిస్తోంది. ఈ దిశగా ఆపార్టీ మెజారిటీ వర్గాల ఓట్లపై కన్నేసింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌ను రాజకీయంగా దెబ్బతీసే యత్నంలో సర్వశక్తులను ఒడ్డుతోంది. కాంగ్రెస్, బీజేపీ ఇతరులకు దక్కే హిందూ ఓట్లను గండికొట్టేందుకు ప్రణాళిక బద్దంగా వ్యూహాలకు పదుపు పెడుతోంది. ఎన్నికల ప్రచారం ఆ పార్టీ కొత్త తరహాలో నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో దళిత, బీసీ కార్డును ఉపయోగించి ప్రచారాంశాలుగా చేసింది. ప్రస్తుతం ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహాన్ని మార్చేయడాన్ని సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. హిందూ ఓట్ల మద్దతు కోసం నానా ఆరాటం చేస్తోంది.
దళితులు, బీసీల ప్రాబల్యం కల్గిన బస్తీలు, ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. జంగం బస్తీ నుంచి భోజగుట్ట వరకు బీసీలు, దళితుల ఓట్లను ప్రసన్నం చేసుకునేలా తన శక్తియుక్తులను కేంద్రీకరించింది. భీంరావువాడ, మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, మాంగార్‌బస్తీ, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, చింతలబస్తీ, ఎసీగార్డ్, లక్ష్మీనగర్, పోచమ్మబస్తీ, మెహిదీపట్నం, మల్లేపల్లి, సీతారాంబాగ్ తదితర చోట్ల హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు తన ప్రచారాన్ని తీవ్రం చేసింది. ఆయా చోట్ల దళిత, బీసీ బంధు స్కీంలను లబ్ధిదారులకు ఇప్పించడం, వారి బస్తీల్లో అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వడం, వారి వ్యక్తిగత సమస్యల పరిష్కరించడం వల్లనే ఆయా వర్గాలు మజ్లీస్‌కు దగ్గరవుతున్నారు. గోకుల్‌నగర్, భీంరావువాడ దళిత బస్తీలో మజ్లీస్ అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనేకమంది యువత, బస్తీసంఘాలు మజ్లీస్‌కి జై కోడుతున్నారు. ఆయా చోట్ల విస్తృత పాదయాత్రలు, ప్రచార సభల్లో హిందూవులు చురుకుగా పాల్గొంటున్నారు.
వారిని ప్రసన్నం చేసుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మాల్చుకోవడంలోను కృతుకృతులవుతోంది. జంగంబస్తీ, నుంచి భోజగుట్ట వరకు దళితులు, బీసీలు అధికంగా ఉంటున్న వర్గాలను ప్రభావితం చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా ముస్లీంల ఓట్లను చేజారిపోకుండా ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ వర్గాల ఓట్లను కూడా దక్కించుకునేందుకు ప్రధానంగా దృష్ఠిని సారించింది. ఈ దిశగా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నది. ప్రధాన పార్టీలకు మద్దతు ఇస్తున్న హిందూ ఓట్లలో గండికొట్టేందుకు పావులు కదుపుతోంది. తన గెలుపు ఖాయం చేసుకునేందుకు కొత్తగా రాజకీయ ఎత్తుగడకు తెరలేపింది. ముస్లింల ఓట్లను కాపాడుకుంటూ.. మరో పక్క తన యత్నాలు తీవ్ర చేస్తూ.. మరో వైపు హిందూ వర్గాలపై కన్నెసింది. రాజకీయ సమీకరణలు, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మజ్లీస్ ఈ దఫా అన్ని వర్గాల ఓట్లను దక్కించుకుని జయకేతనం ఎగురేయాలని పకడ్బంధీ రాజకీయ వ్యూహాలతో ముందడుగు వేస్తోంది.
దళితులు, బీసీ వర్గాలను ప్రభావితం చేస్తున్న మజ్లీస్
తాజాగా మజ్లీస్ తన సీటును ప్రత్యర్థులకు చేజారిపోకుండా, ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలన్నదే ప్రధాన లక్షంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఇతర వర్గాల మద్దతును ఆశిస్తోంది. ఉద్దేశంతో దళిత, బీసీ కార్డును ఉపయోగిస్తోంది. ఈ ఎన్నికలను ఆపార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించి విజయమే లక్షంగా దళితులు, బీసీలు, ఇతర హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు తన రాజకీయ వ్యూహాం మార్చింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో దళిత ఓటర్లున్నారు. ఇదివరలో బల్దియాలో ఇద్దరికి దళితులకు మేయర్‌గా సేవలందించే అవకాశం కల్పించింది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలులో వారిని భాగస్వాములను చేస్తామంటూ హామీలను గుప్పిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ముస్లిం కావడంతో ఆ వర్గం ఓట్లు లభించే అవకాశం ఉంది. ఆయనకు దళిత, బీసీ వర్గాలు మద్దతు ఇవ్వకుండా గండికొట్టేందుకు ఎంఐఎం తన దైన శైలిలో ముందుకు కదులుతోంది. మూడుసార్లు మజ్లీస్ చేతుల్లో ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. నాలుగోసారి మళ్లీ ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన పన్నుతున్న వ్యూహాలకు దీటుగా మజ్లీస్ మరో అ డుగు ముందుకేసి హిందూ వర్గాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తోంది. వారి మద్దతు కోసం మజ్లీస్ నేతలు హామీలతో ముంచెత్తుతున్నారు.