హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆపర్టీ ఎమ్మెల్యేలు కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సూచనప్రాయంగా వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనే టిక్కెట్ లభించడంపై అనిశ్చితి నెలకొందని ఆయన చెప్పారు. నిజం చెప్పాలంటే అందరూ సమర్థులేనని, అయితే అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం కూడా కచ్ఛితంగా చెప్పలేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మాజీ మేయర్ మజీద్ హుస్సేన్, ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్న నేపత్యంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త అభ్యర్థులను నిలుపుతారా లేక హైదరాబాద్‌లో ఏడు స్థానాలకన్నా అధికంగా పార్టీ అభ్యర్థులను నిలుపుతుందా అన్నది ఇంకా తేలవలసి ఉంది.