Monday, December 23, 2024

మీరేం గుణపాఠం నేర్పించారు? : ఓవైసీ

- Advertisement -
- Advertisement -
అమిత్ షాను ఏకీ పారేసిన అసదుద్దీన్ ఓవైసీ

న్యూఢిల్లీ: మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తీవ్రంగా విమర్శించారు. అధికార మత్తు బాగా తలకెక్కించుకున్నారని పేర్కొన్నారు. “2002లో హింసోన్మాదులకు తగిన గుణపాఠం బిజెపి నేర్పింది’ అన్న అమిత్ షా వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు. ‘ఎలాంటి గుణపాఠం నేర్పారు?…” అంటూనే దుయ్యబట్టారు. ఇటీవల ఖేడా జిల్లాలోని మహుదా పట్టణంలో అసదుద్దీన్ ప్రసంగించారు. “ఇదివరలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మతఘర్షణలు జరుగుతుండేవి. కానీ 2002లో గుజరాత్‌లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు. అప్పుడు కొన్ని సంఘ విద్రోహక శక్తులు మతఘర్షణలను రెచ్చగొట్టాయి. ఆ తర్వాత వారికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. వారిని గుజరాత్‌లో గద్దె దింపడం కూడా జరిగింది” అన్నారు.

2002లో గోధ్రా ఘటన తర్వాత గుజరాత్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి. గోధ్రా స్టేషన్ వద్ద 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలకి నిప్పంటుకుని దాదాపు 58 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాగా “బిజెపి శాశ్వత శాంతిని నెలకొల్పింది, మత మారణకాండకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంది” అని అమిత్ షా అన్నారు. ఆయన మాటలని మజ్లీస్ నాయకుడు తూర్పారబట్టారు. “వారు ఇచ్చిన గుణపాఠం ఏమిటంటే, బిల్కిస్‌ను బలాత్కరించిన వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టడమే” అని విమర్శించారు. “నరోడా పాటియా, గుల్బర్గ, బెస్ట్ బేకరి, బిల్కిస్ బానో ఘటనల నుంచి ఆయన ఎలాంటి గుణపాఠాలు నేర్పారు?” అని ఎదురు దాడికి దిగారు.

“అందరి నుంచి అధికారాన్ని లాక్కున్నారు… అది చిరకాలం ఉండబోదు. అధికార మదం తలకెక్కింది. భారత హోమ్ మంత్రి గుణపాఠం నేర్పామంటున్నాడు… ఏం పాఠం నేర్పాడు, ఇప్పుడు దేశానికి కళంకం తెచ్చిపెట్టలేదా? ఢిల్లీ అల్లర్లకు నీవు నేర్పిన గుణపాఠం ఏమిటి?” అని అమిత్ షాను ఆయన తన ప్రసంగంలో నిలదీశారు. “బిజెపి ముస్లిం వ్యతిరేకతను సృష్టిస్తోంది. తమ ప్రచారంలో యూనిఫామ్ సివిల్ కోడ్ , మెహరౌలి హత్యకేసు వంటివి లేవనెత్తి ప్రజలను విభజించాలనుకుంటున్నారు” అని పేర్కొన్నారు. ఇదిలావుండగా గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News