మన తెలంగాణ / హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు నిరుత్సాహపరిచిందన్నారు. కర్ఫ్యూ అమలులో ఉండి, ఎన్నికైన అసెంబ్లీ పనిచేయకుండా చేసి ఎలాంటి చర్చ లేకుండా ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియలో కాశ్మీరీల అభిప్రాయం తీసుకోకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.
భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రంగా ఫెడరలిజం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రాలు తమ అధికార పరిధిలో స్వయంప్రతిపత్తిని కలిగి ఉన్నాయని రాజ్యాంగం సూచిస్తుందని ఆయనన్నారు. రాష్ట్ర శాసనసభలో చర్చించి ఆమోదించాల్సిన తీర్మానాన్ని పార్లమెంటు ఎలా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుందని అసదుద్దీన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రద్దు చేయడం కశ్మీర్ ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. రాష్టాన్ని విభజించడం, తగ్గించడం వంటి చర్యలను ఆయన ఖండించారు.
ఈ నిర్ణయం ద్వారా ఇతర రాష్ట్రాలపై ఇలాంటి చర్యలకు మార్గం సుగమం చేస్తుందని ఆయన హెచ్చరించారు. లడఖ్ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం లేని లెఫ్టినెంట్ గవర్నర్ చేత పాలించబడుతోందన్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని అంగీకరిస్తూనే, ఈ ఏకీకరణ యూనియన్‌తో దాని ప్రత్యేక రాజ్యాంగ సంబంధాన్ని తిరస్కరించదని ఓవైసి అన్నారు. జమ్మూలోని డోగ్రాలు, లడఖ్‌లోని బౌద్ధులపై ఈ నిర్ణయం ప్రభావం గురించి ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి స్పష్టమైన కాలమానం లేకపోవడాన్ని అసదుద్దీన్ ఎత్తిచూపారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.