హైదరాబాద్: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టసవరణ బిల్లుపై మొదట తిరస్కరణకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. హైదరాబాద్ లో సోమవారం వక్ప్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా అధ్యక్షతన సమావేశం జరిగింది. బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిపారు.
దీనకి ముందు అసదుద్దీన్ సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వక్ఫ్ బోర్డు అంశంపై చర్చించారు. అప్పుడు అసదుద్దీన్ తో పాటు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ ఉన్నారు. ముస్లింల ధార్మిక భూములను నియంత్రించడమే వక్ఫ్ బోర్డు పని అని, దానిని ప్రభుత్వం నియంత్రించడానికి పూనుకోవడం సరికాదు అన్నారు అసదుద్దీన్. అవినీతిపై ఫిర్యాదులు వస్తే మాత్రమే ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని సూచించారు. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలలో మత విభజనతో ఓట్లు పొందేందుకు బిజెపి ప్రభుత్వం చూస్తోందని కూడా అసదుద్దీన్ ఈ సందర్భంగా ఆరోపించారు.