అక్క లతతో జ్ఞాపకాలు పంచుకున్న ఆశా భోంస్లే
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోంస్లే తన సోదరి గానకోకిల లతా మంగేష్కర్‌తో తాను గడిపిన బాల్యాన్ని, ఆ నాటి మధురజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 92 సంవత్సరాల లతా మంగేష్కర్ భౌతికకాయానికి ఆదివారం సాయంత్రం పూర్తి స్థాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అయిన కొద్ది సేపటికే ఆశా భోంస్లే తన అక్కగారైన లతతో తాను తీసుకున్న చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో తలలో పువ్వు పెట్టుకున్న చిన్నప్పటి లత పక్కన ఆశ కూర్చుని ఉన్నారు. ఎంత మధురమైనవి ఆ రోజులు..అక్కయ్యతో నేను.. అంటూ 88 ఏళ్ల ఆశా భోంస్లే భావోద్వేగపూరితంగా రాశారు. ఎనిమిది దశాబ్దాల తన సినీ గాన ప్రస్తానంలో లతా మంగేష్కర్ తన సోదరి ఆశా భోంస్లేతో కలసి 50కి పైగా పాటలు పాడారు. వీటిలో పడోసన్ చిత్రంలోని పాపులర్ గీతం మై చలీ మై చలీ, ఉత్సవ్‌లోని మన్ క్యూ బెహకా రే బెహకా, ధరమ్ వీర్‌లోని బంద్ హో ముట్టి తో లాఖ్ కీ వంటి గీతాలు ఉన్నాయి.