మన తెలంగాణ/హైదరాబాద్: సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి కొనియాడారు. సోమవారం మహాత్మా జ్యోతిరావ్ పూలే 196వ జయంతి ఉత్సవాలు సందర్భంగా బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండ పాండురంగచారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాడ హాజరై పూలమాల వేసిన అనంతరం ప్రసంగిస్తూ జ్యోతిరావ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు.
సమసమాజ స్థాపనకు విద్య కీలక పాత్ర పోషిస్తుందని, గుర్తించిన జ్యోతిరావ్ పూలే.. ఈ దేశంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని కోరారని, ఆయన రచనలు గులాంగిరి 1973 సంవత్సరంలో బానిస విధానాలపై పోరాటానికి స్ఫూర్తి అవుతుందని, అదే విధంగా సత్యశోధక్ సమాజ్ నెలకొల్పి శ్రమజీవులు బతుకులు బాగుపడటానికి, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని..నానాటికి పెరుగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల వల్ల దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేసి సంపదంతా పిడికెడు మంది కోటీశ్వరులు దోచుకుంటున్నారని, ఈ దేశంలో పక్షులకు, చెట్లకు లెక్కలు ఉంటాయి కానీ, కనీసం మానవజాతి లెక్క లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశంలో జనగణన జరిగే విధానంలో కుల గణన చేయాలని, చేయని పక్షంలో బడుగు, బలహీన వర్గాల పక్షాన ముందుండి కులగణన జరిగేవరకూ సిపిఐ పోరాడుతుందన్నారు.