Monday, December 23, 2024

ఆశా వర్కర్ల జీతం రూ.9750కి పెంచాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Asha workers salary increased up to 9750

కామారెడ్డి: ఆశా కార్యకర్తలు జీతాల కోసం గతంలో పోరాటాలు చేస్తే అప్పటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీని  ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంబించారు.  ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.  ఈ రోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని కామారెడ్డిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  27 వేల ఆశా కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని,  టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ముఖ్యమంత్రి మాత్రం ఆశా వర్కర్ల మనసు తెల్సుకుని జీతాలను రు. 9750 కి పెంచారని,  తెలంగాణ ఏర్పాటుకు ముందు రు. 1500 మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆశల జీతం రు. 9750 కి చేరిందన్నారు.  ఏడు ఏళ్లలో ఎంత పెరిగిందో ఆలోచించుకోవాలని,  ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆశా వర్కర్లకు ఇచ్చేది 4 వేలు మాత్రమేనని, మన దగ్గర ఇస్తున్నది 9750 రూపాయలు అని గుర్తు చేశారు.  మన పక్క రాష్ట్రం మధ్య ప్రదేశ్ లో ఇస్తున్నది రూ. 3000 మాత్రమేనని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ రు. 3000 ఇస్తున్నారని,  గతంలో మూడు నెలలకు ఒక్కసారి జీతాలు వచ్చేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు ఇస్తుందని కొనియాడారు.  పని తీరుతో ముఖ్యమంత్రి మనసు గెలుచుకోవాలన్నారు.  ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆశలది కీలక పాత్ర అని, బాగా పని చేస్తున్నారని, ఫీవర్ సర్వేతో కరోనా కట్టడి చేసిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.

గర్భిణీ సంక్షేమం కోసం మరింత దృష్టి పెట్టాలని,  ప్రజల ఆరోగ్యం మీ అందరి చేతుల్లోనే ఉందని,  కామారెడ్డి లో వ్యాక్సినేషన్ పక్రియ వంద శాతం అయ్యేలా కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానుపులు పెరగాలని,  దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు త్వరలో ఎన్ సి డి కిట్లు అందజేస్తామని,  ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలో నెంబర్ 3 లో ఉందని,  మోడీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందన్నారు.  మనం మూడు నుండి మొదటి స్థానంలోకి వెళ్లేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.  జుక్కల్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ విధులు నిర్వర్తిస్తూ మరణిస్తే కుటుంబాన్ని ఆదుకుంటున్నామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హరీష్ ప్రకటించారు.

మహబూబ్ నగర్ లో ఎఎన్ఎం చనిపోతే కుటుంబానికి 50 లక్షల చెక్కు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  కష్ట పడితే కడుపుల పెట్టుకొని కాపాడుకుంటామని, పని చేయకుంటే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.  సర్కారు దవాఖానల్లో మందులు అనే ముచ్చట ఉండదని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను మరింత పటిష్టం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.  కాంట్రాక్టు స్టాఫ్ నర్స్, డాక్టర్లు బాగా పని చేయాలని, శాశ్వత నియామకాల్లో వేయిటేజి కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బీ బీ పాటిల్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News