హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీ నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నాని ఆయన గుర్తుచేశారు.
బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మావారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తామన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 28న జరిగే గోల్కొండ బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 30వ తేదీ నుంచి నగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి,లాల్ దర్వాజ బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లుతో పాటు అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతర విజయవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో దేవాదాయ, జిహెచ్‌ఎంసి, జలమండలి, విద్యుత్, వైద్యారోగ్యశాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.