Monday, December 23, 2024

ఎదురులేని ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

ప్రపంచ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా టీమ్ మరోసారి నిరూపించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఉంచిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ పోరాట పటిమతో కంగారూలు సాధించిన ఈ విజయం టెస్టు క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతోంది. ఒకవైపు పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నా ఆస్ట్రేలియా బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్‌తో తమ జట్టుకు అద్భుత విజయం సాధించి పెట్టారు. ఉస్మాన్ ఖ్వాజా, కామెరూన్ గ్రీన్, వికెట్ కీపర్ అలెక్స్ కారీ, కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బౌలర్ నాథన్ లియాన్ పోరాట పటిమను ఎంత పొగిడినా తక్కువే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశారు.

ఇటీవల డబ్లూటిసి ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు ఒత్తిడికి తట్టుకోలేక పెవిలియన్‌ను క్యూ కట్టారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఇలాంటి స్థితిలోనే ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీరానికి చేర్చారు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్నా ఏ మాత్రం చెక్కుచెదర కుండా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఖ్వాజా బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన ఖ్వాజా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో అలరించాడు. ఇక కెప్టెన్ కమిన్స్ కూడా అద్భుతంగా రాణించాడు. తొలుత బంతితో ఆ తర్వాత బ్యాట్‌తోనూ మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్ల దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయే విజయాన్ని జట్టుకు అందించాడు. లియాన్ కూడా తాను ఎంత ప్రమాదకర బౌలరో మరోసారి నిరూపించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బంతితో ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. వార్నర్, స్మిత్, కారీ, ట్రావిస్ హెడ్, గ్రీన్ తదితరులు కూడా అద్భుత ఆటతో జట్టు విజయంలో తమ పాత్రను పోషించారు.

ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా యాషెస్‌లో బోణీ కొట్టింది. ఈ విజయంతో ప్రపంచ క్రికెట్‌లో తనకు తిరుగులేదని మరోసారి చాటింది. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టమైన అంశమే. అయితే ఆస్ట్రేలియా మాత్రం అద్భుత విజయం సాధించి ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అంతేగాక ఈ గెలుపుతో డబ్లూటిసి ఫైనల్లో తమ విజయం గాలివాటం కాదని నిరూపించింది. రానున్న టెస్టు మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా కనిపిస్తోంది. వార్నర్, ఖ్వాజా, లబుషేన్, హెడ్, గ్రీన్, కారీ, కమిన్స్, లియాన్, హాజిల్‌వుడ్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లతో కూడిన ఆస్ట్రేలియాకు ఇది అసాధ్యమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News