Tuesday, January 14, 2025

మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

రూ.500 కోట్లతో రాష్ట్రానికి వస్తున్న ఆశీర్వాద్

అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రానికి రానున్న ఆశీర్వాద్
దావోస్‌లో మంత్రి కెటిఆర్‌తో అలియాక్సిస్ సిఇఒ కోయిన్ స్టికర్ భేటీ
తెలంగాణ పెవిలియన్‌లో ఒప్పందం
ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉపాధి ఉద్యోగావకాశాలు : మంత్రి కెటిఆర్
మాకు హైదరాబాద్ అతిపెద్ద రెండవ కార్యాలయం : నోవార్టిస్
కెటిఆర్‌తో భేటీ అయిన నోవార్టిస్ సిఇఒ వసంత్ నరసింహాన్
మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆధిత్య ఠాకరేతో చర్చలు
తెలంగాణ చేపట్టిన కార్యక్రమాల అధ్యాయానికి వస్తానన్న ఠాకరే

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు దావోస్ పర్యటనలో తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. రెండవ రోజు కూడా రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ ఆశీర్వాద్ పైప్స్ (అలియాక్సిస్) గ్రూప్ రాష్ట్రంలో రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కెటిఆర్ సమక్షంలో తెలంగాణ పెవిలియన్‌లో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అలియాక్సిస్ కంపెనీ సిఇఒ కోయిన్ స్టికర్ కెటిఆర్‌తో సమావేశం అయ్యారు. తాము ఏర్పాటు చేయనున్న ఈ తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్ , డిస్ట్రిబ్యూషన్ పైల్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ సిఇఒ తెలిపారు.

కేవలం దేశీయ మార్కెట్ల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇతర దేశాల కోసం సైతం తెలంగాణ నుంచి తయారుచేయడమే లక్ష్యంగా తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆశీర్వాద్ పైప్స్ యజమాన్యానికి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఆశీర్వాద్ పైప్స్ పెట్టుబడి ద్వారా ఈ రంగంలో మరిన్ని ఉత్పత్తులు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

నోవార్టిస్‌కు అతిపెద్ద రెండవ కార్యాలయంగా మారిన హైదరాబాద్

హైదరాబాద్‌లోని తమ కార్యాలయం అతిపెద్ద రెండవ కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ప్రకటించింది. మంత్రి కెటిఆర్‌తో నోవార్టిస్ సిఇఒ వసంత్ నరసింహన్ సమావేశమయ్యారు. తెలంగాణలో నోవార్టిస్ కంపెనీ విస్తరణ ప్రణాళికలపైన చర్చించారు. ఇప్పటికే తమ కంపెనీ అనేక దేశాల్లో తయారీ యూనిట్లతో పాటు, ఇతర పరిశోధన కేంద్రాలను కలిగి ఉన్నదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో తమ కార్యాలయం ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని నరసింహన్ వెల్లడించారు. భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీలకెల్లా తమ నోవార్టిస్ సెంటర్ అతి పెద్దదన్నారు. స్విట్జర్లాండ్ బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9000 మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం రెండవ అతి పెద్ద కార్యాలయంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, డిజిటల్ కార్యక్రమాలకు ఏషియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు.

మంత్రి కెటిఆర్ నోవార్టిస్ కంపెనీ సాధిస్తున్న వృద్ధిని మెచ్చుకున్నారు. నోవార్టిస్ కేంద్ర కార్యాలయానికి భారతదేశంలో అతిపెద్ద కార్యక్షేత్రంగా హైదరాబాద్ మారడం అత్యంత సంతోషదాయకమన్నారు. హైదరాబాద్‌లో నోవార్టిస్ విస్తరణ వలన రాష్ట్ర లైఫ్ సైన్స్ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. నోవార్టిస్ వల్ల ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్ర శ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్య స్థానంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ ఇకో సిస్టం ప్రతిష్టను మరింత ఇనుమడిస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో భారీగా విస్తరించిన నోవార్టిస్ సంస్థకు మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు పెద్ద సవాల్

ఏఐ ఆన్ ది స్ట్రీట్….. మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్ అన్న అంశంపై జరిగిన చర్చలో మంత్రి కెటిఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌తో అనుసంధానమైన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ఉన్న సవాళ్ల అంశాన్ని కెటిఆర్ తన మాటల్లో ప్రస్తావించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ప్రజల విశ్వాసాన్ని పొందవలసి ఉందని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వాలకు పెద్దసవాల్ వంటిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ టెక్నాలజీ ఉపయోగాలతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు కూడా పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రధానంగా ప్రజలకు సంబంధించిన డేటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు అనుమతి లేకుండా ఈ టెక్నాలజీని నిఘా కార్యకలాపాలకు ఉపయోగించమన్న అంశంపై ప్రజలకు పెద్దఎత్తున భరోసా కల్పించాలన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. అయితే పార్లమెంటరీ పద్ధతిలో, పారదర్శకంగా ఈ అధికారాలను ప్రభుత్వ విభాగాలకు కల్పించాలన్నారు.

అలాగే ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీతో నేరస్థులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి వ్యక్తులపై ఆధారపడే అవసరం పోలీసులకు తగ్గుతోందన్నారు.. సరైన విధానంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఫేషియల్ రికగ్నిషన్‌తోనే నేర నియంత్రణ, సమర్థ పోలీసింగ్ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటున్నాయన్నారు.

త్వరలోనే హైదరాబాద్‌కు వస్తా….!

మంత్రి కెటిఆర్‌ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే కలిశారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ఇద్దరు నేతలు… అక్కడ భేటీ అయి రాష్ట్రాల అభివృద్ధి, పథకాలపై చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతిపైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్, పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం వంటి కీలకమైన సంస్కరణలను ఆదిత్య థాకరేకు కెటిఆర్ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు త్వరలోనే హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే కెటిఆర్‌కు తెలిపారు. వాటితో పాటు మహారాష్ట్రలో పట్టణ అభివృద్ధిలో చేపట్టిన పలు అంశాలపైన ఆదిత్య థాకరే కెటిఆర్‌కు వివరాలు అందించారు. పరస్పరం కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News