నియామకానికి ఆమోదం తెలిపిన సెబీ
ముంబై : ఎన్‌ఎస్‌ఇ (నేషనల్ స్టాక్ ఎక్సేంజ్) సిఇఒగా ఆశిష్ కుమార్ చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బిఎస్‌ఇ (బాంబే స్టాక్ ఎక్సేంజ్ ) ఎండి, సిఇఒగా ఉన్న చౌహాన్‌ను ఎన్‌ఎస్‌ఇ బాస్‌గా నియమించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బిఎస్‌ఇలో చౌహాన్ వరుసగా రెండోసారి సిఇఒగా కొనసాగగా, ఆయన పదవీకాలం నవంబర్‌లో ముగుస్తుంది. ఇప్పటికే బిఎస్‌ఇ కూడా కొత్త చీఫ్ కోసం వేటను ప్రారంభించింది. విక్రమ్ లిమాయే నుంచి ఎస్‌ఎస్‌ఇ చీఫ్‌గా చౌహాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. లిమాయే పదవీకాలం శనివారం నాడు ముగియగా, మరోసారి కొనసాగేందుకు ఆయన నిరాకరించారు. 1992 నుంచి 2000 మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఇ కోసం పనిచేసిన వ్యవస్థాపకుల్లో చౌహాన్ ఒకరిగా ఉన్నారు. ఎన్‌ఎస్‌ఇలో భారత్‌లో ఆధునిక ఫైనాన్షియల్ డెరివేటివ్స్ పితగా ఆయన అందరికీ తెలుసు. ఇప్పుడు స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఎస్‌ఇకి మళ్లీ ఆయన రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.