లఖీంపూర్ ఘటన పరిణామం. పోలీసు కస్టడీపై నేడు విచారణ
లఖీంపూర్ ఖేరీ : ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించారు. ఆయనను వెంటనే స్థానిక ప్రధాన జిల్లా జైలుకు తరలించారు. శనివారం రాత్రి ఆయనను ఇక్కడి కోర్టులో హాజరుపర్చారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత న్యాయమూర్తి మిశ్రాను జైలుకు పంపిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. శనివారం రాత్రి అంతా అశిష్ స్థానిక జిల్లా జైలులో గడిపారు. ఘటనకు సంబంధించి పలు అంశాల విచారణ తరువాత అశీష్ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దాదాపుగా 12 గంటలపాటు విచారించారు.
ఈ క్రమంలో ఆయన పోలీసుల ప్రశ్నలకు పొడిపొడి సమాధానాలు ఇచ్చినట్లు , అధికారవర్గాలకు పెద్దగా సహకరించనట్లు స్పష్టం అయింది. తమ కస్టడీకే ఆయనను ఇతరులను అప్పగించాలని పోలీసు విభాగం కోరింది. అయితే దీనికి స్పందించని న్యాయస్థానం ఆయనను జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నట్లు తెలిపింది. ఇక్కడి క్రైంబ్రాంచ్ కార్యాలయంలో ఆయనకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువచ్చారు. జుడిషియల్ కస్టడీ ఆదేశాలు వెలువడినట్లు సీనియర్ విచారణాధికారి ఎస్పి యాదవ్ వార్తా సంస్థలకు తెలిపారు. ఇక పోలీసు రిమాండ్కు ఆయనను అప్పగించాలనే తమ దరఖాస్తుపై సోమవారం (నేడు) ఉదయం 11 గంటలకు విచారణ జరుగుతుందని వివరించారు. ఈ నెల 3వ తేదీన కేంద్ర మంత్రి కుమారుడి వాహనాలు రైతులపై నుంచి దూసుకువెళ్లిన క్రమంలో రైతులు మృతి చెందారనే అభియోగాలతో ఎట్టకేలకు కేసులు తరువాతి క్రమంలో అరెస్టు జరిగింది. మోనూ భయ్యాగా పిలవబడే అశీష్ మిశ్రా రాత్రి జైలులో ఉన్నారు. రెండోసారి సమన్ల తరువాతనే ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉన్న అశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ప్రాతినిధ్యం వహించే ఖేరీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానంలో చురుగ్గా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటూ వస్తున్నారు.