లక్నో: లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడుగా భావిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు జడ్జీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. శనివారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో శనివారం రాత్రే జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీనికి ముందు క్రైం బ్రాంచ్ కార్యాలయంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆశిష్ మిశ్రాను పోలీసు రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్‌పి యాదవ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే పోలీసు రిమాండుకు అతడిని ఇచ్చే విషయాన్ని అక్టోబర్ 11(సోమవారం) ఉదయం 11.00 గంటలకు విచారించనున్నట్లు న్యాయమూర్తి టైమ్‌ను ఫిక్స్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతుల మీదికి వాహనాన్ని పోనిచ్చిన ఘటనలో నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతి చెందారు. రైతుల మృతిపై ప్రథమ సాక్షాధార నివేదిక(ఎఫ్‌ఐఆర్) నమోదయింది. నిందితుడు ఆశిష్ మిశ్రా శనివారం క్రైంబ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు. అతడిని పోలీసులు 11 గంటలపాటు ప్రశ్నించి తర్వాతే అరెస్టుచేశారు. విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు.