కాబూల్: తాలిబన్లు రాజధాని కాబూల్ లోకి ప్రవేశించడంతో దేశం నుండి పారిపోవడంపై అధ్యక్షుడు అష్రఫ్ ఘని వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశాడు. రక్తపాతాన్ని నివారించేందుకే దేశం విడిచి వెళ్లానని అష్రఫ్ ఘనీ అన్నారు. కాబూల్‌పై దాడి చేయడానికి తాలిబన్లు వచ్చారని.. ప్రతిఘటించి ఉంటే ఎంతో మంది దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు. ఈ రక్తపాతాన్ని ఆపడానికి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. తాలిబాన్లు ఈ యుద్ధాన్ని కత్తులు, తుపాకులతో గెలిచారని, ఇప్పుడు ప్రజల గౌరవం, సంపదను కాపాడాల్సిన బాధ్యత తాలిబాన్లదే అన్నారు. ప్రజల హృదయాలను తాలిబాన్ గెలుచుకోలేదన్నారు. దేశంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారని.. అఫ్ఘన్ ప్రజలతోపాటు వివిధ దేశాలకు వారు హామీ ఇవ్వాల్సిన అవసంరం ఉందన్నారు. ముఖ్యంగా దేశ మహిళల హృదయాలను చట్టబద్ధంగా గెలుచుకోవాల్సి ఉందన్నారు. ఇప్పుడు తాలిబాన్ల ముందు పెద్ద పరీక్ష ఉందని.. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పేరు, గౌరవాన్ని కాపాడటంపైనా దృష్టి పెడతారా? లేక అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తారనే విషయాన్ని తాలిబాన్ తేల్చుకోవాలన్నారు. దేశాభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని ఘని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు, ఇప్పటికే అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. దేశంలో తాలిబన్ల పాలన రావడంతో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు పరుగులు పెడుతున్నారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టు వేలమంది జనంతో కిక్కిరిసిపోయింది. ఆర్మీ విమానాల్లోకి ఎక్కుతున్న అఫ్ఘన్ లను అమెరికా బలగాలు అడ్డుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో భయంతో అఫ్ఘన్ పౌరులు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు పౌరులు చనిపోయారు. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో ఇప్పటికీ కార్యాలయాలు, పాఠశాలలు తెరుచుకోలేదు. భారత పౌరుల కోసం కాబూల్ ఎయిర్ పోర్టులో ఇండియా రెండు విమానాలను సిద్ధం చేసింది.
Ashraf Ghani respond leaves the Country