Saturday, December 21, 2024

రెండు రోజుల్లో ఆర్టీసి బిల్లుకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల్లో ఆర్టీసి బిల్లుకు ఆమోదం
బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించాలని గవర్నర్‌ను కోరిన ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండ్రోజుల్లో దానికి ఆమోదం తెలపనున్నట్లు గవర్నర్ చెప్పారని ఆర్టీసి జేఏసి నేతలు వెల్లడించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా ఈ మేరకు ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలు, విలీన ప్రక్రియకు సంబంధించి పలు సూచనలను గవర్నర్ చేసినట్లు వారు తెలిపారు. బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించాలని ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు గవర్నర్‌ను కోరారు. సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని ఆ విషయాన్నే గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. తన వద్దకు ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితమే బిల్లు వచ్చినట్లు గవర్నర్ తెలిపారని వారు పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చిన బిల్లులో పది సూచనలు చేసినట్లు గవర్నర్ తమతో పేర్కొన్నారని వారు వెల్లడించారు. తాము చెప్పిన సమస్యలపై తమిళిసై సానుకూలంగా స్పందించిందని వారు పేర్కొన్నారు.

ప్రతి ఉద్యోగి ప్రయోజనాలను పరిరక్షిస్తాం: గవర్నర్
మరోవైపు ఆర్టీసి బిల్లు వ్యవహారంపై తాజాగా స్పందించిన తమిళిసై ఆర్టీసిలోని ప్రతి ఉద్యోగి ప్రయోజనాలను పరిరక్షించాలన్నదే తన ఆలోచన అన్నారు. ఆర్టీసి విలీనం ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న భావోద్వేగ అంశమని చెప్పారు. ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చడంలో రాజ్‌భవన్ అడ్డురాదని గవర్నర్ స్పష్టం చేశారు.
ఆసుపత్రి సేవలు, ఆర్టీసి అప్పులు
పదవీ విరమణ పొందిన కార్మికులకు సంస్థ తరపున రావాల్సినవి అందించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు వేతన సవరణ అంశాలు, సిసిఎస్ నిధులను ప్రభుత్వం వాడుకున్న అంశాన్ని, ఆసుపత్రి సేవలు, ఆర్టీసి అప్పులు తదితర అంశాలను తమిళిసై దృష్టికి తీసుకెళ్లామని నాయకులు తెలిపారు. విలీనం అని చెప్పి ప్రభుత్వం మిగతా సమస్యలను వదిలేసిందని, 2017 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత వేతనాలు ఉన్నాయో అంత ఇవ్వాలని గవర్నర్ అడిగామని వారు పేర్కొన్నారు. గవర్నర్ ఆర్టీసి విలీన బిల్లును అమోదిస్తానని తమకు హామీ ఇచ్చారని ఆర్టీసి జేఏసీ నేతలు పేర్కొన్నారు.
కేంద్రం సమ్మతి తీసుకున్నారా? లేదా?
గతంలో ఆర్టీసి బిల్లుపై గవర్నర్ తమిళిసైలేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినా మరికొన్ని సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ తమిళిసై అడిగిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసిలో భారత ప్రభుత్వ వాటా 30 శాతం ఉన్నందున కేంద్రం సమ్మతి పొందారా లేదా అన్న విషయమై వివరణ కోరిన గవర్నర్ సమ్మతి పొందినట్లైతే ప్రతిని ఇవ్వాలని లేదంటే చట్టబద్ధత పాటించేలా తీసుకున్న చర్యలను తెలపాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ఆర్టీసి స్థిర, చరాస్థులు కార్పొరేషన్‌లోనే కొనసాగుతాయా?
సంస్థలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను కేటగిరీలు, డిపోల వారీగా మొత్తం సంఖ్యను అందించాలన్న గవర్నర్ కాంట్రాక్ట్, క్యాజువల్, ఇతర ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. తాత్కాలిక ఉద్యోగుల కోసం తీసుకునే చర్యల వివరాలు గురించి ప్రభుత్వాన్ని అడిగారు. భూములు, భవనాలు తదితర ఆర్టీసి స్థిర, చరాస్థులు కార్పొరేషన్‌లోనే కొనసాగుతాయా? లేదా వాటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందా అని గవర్నర్ ప్రశ్నించారు.

బస్సులు నడిపే బాధ్యత ఎవరిదని? ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికుల ప్రయో జనాల పరిరక్షణలో కార్పొరేషన్ పాత్ర గురించి వివరాలను చెప్పాలని కోరారు. ఆర్టీసి ఉద్యోగులు ప్రభుత్వ సర్వీసులో చేరిన తర్వాత వారు సంస్థలో డిప్యూటేషన్‌పై పని చేస్తారా? లేదా ఇతర ఏర్పాట్లు చేస్తారా? అనే దానిపై తమిళిసై వివరణ కోరారు.
ఈ అంశాలపై వీలైనంతర త్వరగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన తమిళిసై బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు ఈ వివరణలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే గవర్నర్ రెండో మారు కోరిన వివరణలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News