Sunday, December 22, 2024

భారత్ 339/6

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. అశ్విన్ (102) అజేయ శతకం సాధించగా, జడేజా 86 (నాటౌట్) అతనికి అండగా నిలిచారు. ఇద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 195 పరుగులు జోడించడం విశేషం.
ఆరంభంలోనే షాక్..
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బంగ్లా స్పీడ్‌స్టర్ హసన్ మహమూద్ అద్భుత బౌలింగ్‌తో అతన్ని వెనక్కి పంపాడు. ఆ వెంటనే శుభ్‌మన్ గిల్ (0) కూడా వెనుదిరిగాడు. అతను ఖాతా కూడా తెరవలేదు. ఈ వికెట్ కూడా హసన్‌కే దక్కింది. మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా నిరాశ పరిచాడు. కోహ్లి ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతన్ని కూడా హసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

యశస్వి, పంత్ పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తమపై వేసుకున్నారు. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. యశస్వి సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, పంత్ ధాటిగా ఆడాడు. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు చాలా సేపలి వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే ఆరు ఫోర్లతో 39 పరుగులు చేసి జోరు మీద కనిపించిన రిషబ్ పంత్‌ను కూడా హసన్ మహమూద్ వెనక్కి పంపడం విశేషం. తర్వాత వచ్చిన కెఎల్ రాహుల్ అండతో యశస్వి తన పోరాటాన్ని కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 118 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 52 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆదుకున్న అశ్విన్, జడేజా..
ఒక దశలో 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన టీమిండియాను రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు చిరస్మరణీయ బ్యాటింగ్‌తో గట్టెక్కించారు. ఇద్దరు బంగ్లా బౌలర్ల ధాటిని తట్టుకుంటూ ముందుకు సాగారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా ఇటు జడేజా అటు అశ్విన్ అసాధారణ పోరాట పటిమతో జట్టును ఆదుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అశ్విన్ ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. జడేజా కూడా దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించింది. వీరిని ఔట్ చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన కృషి ఫలించలేదు. చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన 112 బంతుల్లోనే 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 117 బంతుల్లో పది బౌండరీలు, మరో రెండు సిక్స్‌లతో అజేయంగా 86 పరుగులు చేశాడు. ఇద్దరు ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 58 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News