Saturday, November 23, 2024

అశ్విన్‌కు మళ్లీ నిరాశే!

- Advertisement -
- Advertisement -

నాలుగో టెస్టులో కూడా దక్కని చోటు

Ashwin not in team India in 4th test

లండన్: టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అతనికి మరోసారి మొండిచెయ్యి చూపించారు. నాలుగో టెస్టులో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్‌కు చోటు కల్పిస్తారని అందరూ భావించారు. అయితే జట్టు యాజమాన్యం మాత్రం అశ్విన్‌ను కాదని జడేజాకే ఛాన్స్ ఇచ్చింది. దీంతో అశ్విన్ మరోసారి పెవిలియన్‌కే పరిమితంకాక తప్పలేదు. ప్రపంచలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరున్న అశ్విన్‌పై కొంత కాలంగా జట్టు కెప్టెన్ చిన్నచూపు చూస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. విరాట్ కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా అశ్విన్‌ను టెస్టులకు దూరంగా ఉంచుతున్నాడనే విమర్శలు మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్నాయి. అయితే కెప్టెన్ కోహ్లి మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడూ కొట్టి పారేస్తు వస్తున్నాడు.

కానీ పరిస్థితులను గమనిస్తే మాత్రం కోహ్లికి అశ్విన్ మీద ఏదో కోపం ఉందనే విషయం స్పష్టమవుతోంది. అందుకే అతనికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లలో అశ్విన్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాలోనే ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయినా కూడా విదేశాల్లో జరిగే టెస్టు సిరీస్‌లలో అశ్విన్‌పై చిన్నచూపు చూడడం అనవాయితీగా వస్తోంది.

ఎంతో అనుభవజ్ఞుడైన అశ్విన్‌కు తుది జట్టులో స్థానం కల్పించక పోవడం అతని అభిమానులను ఎంతో నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు అశ్విన్ కూడా దీన్ని ఒక అవమానంగానే భావిస్తున్నాడు. మంజ్రేకర్, జహీర్ ఖాన్, లక్ష్మణ్, గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు అశ్విన్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని సూచిస్తున్నారు. అయినా కూడా కెప్టెన్ కోహ్లికానీ, కోచ్ రవిశాస్త్రికానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇక వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా, పూర్తి ఫిట్‌నెస్‌తో లేకున్నా జడేజాకు మరో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ తుది జట్టులో స్థానం దక్కింది. అన్ని అర్హతలు ఉన్నా అశ్విన్ మాత్రం పెవిలియన్‌కే పరిమితం కాక తప్పడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News