వారణాసి : సుప్రీంకోర్టు నుంచి కూడా అనుమతి దక్కడంతో స్థానిక జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ) శాస్త్రీయ సర్వే పనులు రెండోరోజు కూడా జరిగాయి. 17వ శతాబ్ధపు ఈ మసీదు వివాదాస్పదం అయింది. శుక్రవారం నాటి సర్వే పనుల దశలో సంబంధిత ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. సర్వేను బహిష్కరించారు.
అయితే శనివారం ముస్లిం పక్షం తరఫున ఐదుగురు సభ్యులు సర్వే బృందంతో కలిసి పనులలో తమ ప్రాతినిధ్యం చాటుకుంది. వీరిలో కమిటీ తరఫు న్యాయవాదులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎఎస్‌ఐ సర్వే పని సాగింది. బృందం వెంబడి వరుసగా రెండోరోజున కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది రాజేష్ మిశ్రా ఉన్నారు. ముందు మసీదు కమిటీ వారు తాళాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఇచ్చారని సర్వేకు సహకరిస్తున్నారని హిందూ పక్షం తరఫు లాయర్ సుధీర్ త్రిపాఠీ తెలిపారు. ఇక్కడి శిథిలాల్లో విగ్రహాలు కాదుగానీ విగ్రహాల ముక్కలు దొరికాయని, త్వరలోనే విగ్రహాలు కూడా దొరుకుతాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.