Thursday, November 14, 2024

ఇండోపాక్ సమరం నేడే

- Advertisement -
- Advertisement -

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ

చెన్నై: ప్రతిష్టాత్మకమైన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్‌భారత్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ఇరు జట్లు కూడా ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆతిథ్య జట్టు మూడింటిలో విజయం సాధించింది. మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. పాకిస్థాన్ నాలుగు మ్యాచుల్లో ఒకటి గెలిచి మరో దాంట్లో ఓడింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసింది. ప్రస్తుతం పాక్ ఐదు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రానున్న సెమీ ఫైనల్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది.

Also Read: ఇండియా టార్గెట్ 160

కాగా, చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాక్ జట్ల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌పై అందరి దృష్టి నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. పాక్‌తో పోల్చితే భారత్ కాస్త బలంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం కూడా టీమిండియాకు కలిసి వచ్చే అంశమే. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. పెనాల్టీ కార్నర్ నిపుణులు హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, మన్‌దీప్ సింగ్ తదితరులు అద్భుత ఆటతో అలరిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో వీరు నిలకడగా రాణించారు. ఇక నీలకంఠ శర్మ, ఆకాశ్ దీప్ సింగ్‌లు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇలా ప్రతి ఆటగాడు తమవంతు పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తుండడంతో భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో నిలకడైన విజయాలు సాధించింది.

దాయాది పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా సత్తా చాటేందుకు భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఈసారి కూడా హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన హర్మన్‌ప్రీత్ చెలరేగితే పాక్‌ను ఓడించడం భారత్‌కు కష్టమేమీ కాకపోవచ్చు. మన్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్, నీలకంఠ, మణ్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్ తదితరులు కూడా మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశలో అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని భారత్ తహతహలాడుతోంది. పాక్‌ను ఓడిస్తే భారత్‌కు అగ్రస్థానం ఖాయమవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం కాస్త కష్టమవుతోంది. మలేసియా చివరి మ్యాచ్‌లో కొరియాపై గెలిచి టీమిండియా పాక్ చేతిలో ఓడి పోతేనే భారత్ రెండో స్థానానికి పరిమితమవుతోంది. కాగా, బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లలో జపాన్‌తో చైనా, మలేసియాతో కొరియా జట్లు తలపడుతాయి. ఇక ఆఖరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఢీకొంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News