Saturday, November 23, 2024

హైవోల్టేజ్ సమరం.. నేడు భారత్‌-పాకిస్థాన్‌ల పోరు

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో జరిగే వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు రిహారల్స్‌గా ఈ మ్యాచ్‌ను పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి రానున్న ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఇరు జట్ల ఆటగాళ్లు ఉన్నారు. ఇక రెండు జట్ల మధ్య జరిగే ప్రతి మ్యాచ్ దాదాపు రసవత్తరంగానే కొనసాగడం అనవాయితీగా వస్తోంది.

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌పాక్ మ్యాచ్‌లకు ఉండే ఆదరణ మరే పోటీకి ఉండదంటే అతిశయోక్తి కాదు. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని సాధించిన పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. భారత్ కూడా పాకిస్థాన్‌ను ఓడించి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో దాయాదిల మధ్‌య జరిగే పోరు చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

విజయమే లక్షంగా..
టీమిండియా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి రానున్న వరల్డ్‌కప్‌కు సమరోత్సాహంతో సిద్ధం కావాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, షమి, బుమ్రా, సిరాజ్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. రోహిత్, గిల్ ఈ మ్యాచ్‌లో జట్టుకు కీలకంగా మారారు. వీరిద్దరూ శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లు వేగంగా ఆడేందుకు వీలుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గిల్, రోహిత్‌లు రాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

అందరి కళ్లు కోహ్లిపైనే..
మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే పాకిస్థాన్ బౌలర్లకు కష్టాలు ఖాయం. కొంతకాలంగా వన్డేల్లో కోహ్లి నిలకడగా రాణిస్తుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక గాయంతో సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. ఆసియాకప్‌లో రాణించడం ద్వారా రానున్న వరల్డ్‌కప్‌లో టీమిండియాలో చోటును ఖాయం చేసుకోవాలని భావిస్తున్నాడు. తగినంత ప్రాక్టీస్ లేకుండానే ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న శ్రేయస్ ఎలా ఆడుతాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, ఆల్‌రౌండర్లు హార్దిక్, జడేజాలు కూడా సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరాజ్, షమి, బుమ్రా, కుల్దీప్, అక్షర్‌లతో భారత బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలుఅధికంగా కనిపిస్తున్నాయి.

జోరుమీదుంది..
ఇదిలావుంటే తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్ ఈ మ్యాచ్‌కు రెట్టించిన విశ్వాసంతో సిద్ధమైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత ఫామ్‌లో ఉండడం పాక్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో బాబర్ కళ్లు చెదిరే శతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, వికెట్ కీపర్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆఘా సల్మాన్, నవాజ్, షాదాబ్, రవూఫ్, సోహైల్, షాహిన్ తదితరులతో పాకిస్థాన్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News