ముల్తాన్: ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు బుధవారం తెరలేవనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న మెగా టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. బుధవారం ప్రారంభమయ్యే ఆసియాకప్ సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. తొలి మ్యాచ్ ముల్తాన్ వేదికగా జరుగనుంది. ఇందులో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, నేపాల్‌లు ఒక గ్రూపులో ఉండగా శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్‌లో మరో గ్రూపులో ఉన్నాయి. ప్రతి గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్4కు అర్హత సాధిస్తాయి. ఇక ఆసియాకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌ల సమరం శనివారం పల్లెకెలె వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇక గురువారం శ్రీలంకబంగ్లాదేశ్‌ల మధ్య పోరు జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియాకప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లకు పాకిస్థాన్ మిగిలిన మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది.
ఫేవరెట్‌గా పాకిస్థాన్
ఇక నేపాల్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో విజయం సాధించిన పాకిస్థాన్ ఈ మెగా టోర్నీకి సమరోత్సాహంతో సిద్ధమైంది. పసికూనగా పరిగణించే నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ పాకిస్థాన్ ఏకపక్ష విజయం సాధించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాక్ సమతూకంగా ఉంది. ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఆఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, అబ్దుల్లా షఫిక్, వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పాక్‌లో ఉన్నారు. అంతేగాక షాహిన్ అఫ్రిది హారిస్ రవూప్, మహ్మద్ నవాజ్, మహ్మద్ హారిస్, నసీమ్ షా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా పాక్‌కు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేపాల్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. కుశాల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పుడెల్, కుశాల్ మల్లా, సోంపాల్ కామి, సందీప్ లమిచానే వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు నేపాల్‌లో ఉన్నారు. దీంతో నేపాల్ కూడా పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.