ముంబై: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంక వేదికగా జరుగనుంది. శనివారం జరిగిన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆసియా కప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఆసియా కప్‌లో పోటీ పడనున్నాయి. ఈ టోర్నీలో భారత్‌తో పాటు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు పాల్గొంటున్నాయి.
మరో జట్టును క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఎంపిక చేశారు. క్వాలిఫయింగ్ పోటీల్లో యుఎఇ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ జట్లు పోటీ పడనున్నాయి. కాగా, 2023 ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. నిజానికి కిందటి ఏడాదే పాకిస్థాన్ ఆధ్వర్యంలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా టోర్నీని వాయిదా వేయక తప్పలేదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆసియాకప్ క్రికెట్ టోర్నీని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జై షా పదవీ కాలాన్ని ఓ ఏడాది పాటు పొడిగిస్తూ వార్షిక సమావేశం నిర్ణయం తీసుకుంది. 2024 వరకు జైషా అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.