Friday, November 22, 2024

నేడు ఆసియాకప్ ఫైనల్ సమరం

- Advertisement -
- Advertisement -

Asia cup final match today

దుబాయి: ఆసియాకప్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. దుబాయి వేదికగా జరిగే ఫైనల్లో శ్రీలంకపాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ట్రోఫీని దక్కించుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇక ఆసియాకప్‌లో శ్రీలంక అసాధారణ ఆటతో అలరిస్తోంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిన లంక సూపర్4లో అజేయంగా నిలిచింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. ఫైనల్‌కు చేరే క్రమంలో అఫ్గానిస్థాన్, భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను మట్టికరిపించింది. ఇక తుది పోరులో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక సమతూకంగా కనిపిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లంక ఫైనల్లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఓపెనర్లు నిసాంకా, కుశాల్ మెండిస్‌లు ఫామ్‌లో ఉండడం లంకకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ జట్టుకు కీలకంగా మారారు. వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా పాకిస్థాన్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక కెప్టెన్ దాసున్ శనక, దనుష్క గుణతిలక, భానుకా రాజపక్సా, వనిండు హసరంగా వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు లంకకు అందుబాటులో ఉన్నారు. వీరంతా ఫైనల్లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. అంతేగాక తీక్షణ, మదుషాన్, ధనంజయ డిసిల్వా, హసరంగా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఆసియాకప్‌లో శ్రీలంకకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో శ్రీలంక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శనతో అలరిస్తోంది. పెద్ద పెద్ద జట్లను సయితం అలవోకగా ఓడిస్తూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో జరిగే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆసియాకప్‌ను లంక ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దేశంలో అల్లకల్లోల పరిస్థితిలు నెలకొన్నా లంక అధైర్య పడకుండా క్రికెట్‌లో నిలకడైన విజయాలు సాధిస్తూ ప్రజల్లో కొత్త స్ఫూర్తి నింపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది లంక అభిమానులు తమ టీమ్ ట్రోఫీని సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో లంక జట్టు ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

తక్కువ అంచనా వేయలేం

మరోవైపు పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా పాక్‌కు ఉంది. దీనికి అఫ్గానిస్థాన్, భారత్‌లతో జరిగిన మ్యాచుల్లో పాకిస్థాన్‌లు సాధించిన విజయాలే నిదర్శనం. లంకతో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు ఓటమి ఎదురైంది. అయితే అప్పటికే భారత్, అఫ్గాన్‌లను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఇక ఆదివారం లంకతో జరిగే ఫైనల్‌ను పాకిస్థాన్ సవాల్‌గా తీసుకొంటోంది. ఎలాగైనా లంకను ఓడించి ట్రోపీ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ సమతూకంగా ఉంది. రిజ్వాన్, బాబర్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్, నవాజ్, ఆసిఫ్, హసన్ అలీ తదితరులతో పాక్ బ్యాటింగ్ పటిష్టంగానే కనిపిస్తోంది. అంతేగాక హస్‌నైన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, నవాజ్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు కూడా ట్రోఫీ గెలిచే అవకాశాలు సమంగా ఉన్నాయనే చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News