ముంబై: ఐపిఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకుంది. ఇక, శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ముంబై, గుజరాత్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇందులో గెలిచి మరోసారి ఫైనల్ వెళ్లాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఈ నెల28న జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో చెన్నైతో తలపడనుంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫైనల్ పోరును ఆస్వాదించడానికి పలు దేశాల క్రికెట్ బోర్డు అధ్యక్షులను బిసిసిఐ ఆహ్వానించింది. మే 28న జరగనున్న టాటా ఐపిఎల్ 2023 ఫైనల్‌కు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డుల అధ్యక్షులు హాజరవుతారని.. ఈ సందర్భంగా ఆసియా కప్ 2023కి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను వివరించేందుకు వారితో చర్చలు జరుపుతామని బిసిసిఐ కార్యదర్శి జే షా వెల్లడించారు.