క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో ఆసియాకప్‌నకు ప్రత్యేక స్థానం ఉంది. వరల్డ్‌కప్ తర్వాత అభిమానులను ఎక్కువగా అలరించేది ఆసియాకప్ టోర్నమెంటే అనడంలో సందేహం లేదు. ఉప ఖండంలోని జట్ల మధ్య క్రమం తప్పకుండా ఆసియాకప్ నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. 1983లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి సంవత్సరం 1984 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆసియాకప్ ట్రోఫీని నిర్వహిస్తూ వస్తున్నారు. తొలి ఆసియాకప్ 1984లో యుఎఇ వేదికగా జరిగింది. చివరి ఎడిషన్ ఆసియాకప్ 2022లో నిర్వహించారు. ఇది కూడా యుఎఇలోనే జరగడం విశేషం. ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఆసియాకప్ ట్రోఫీలు జరిగాయి. ఇందులో భారత్ అత్యధికంగా ఏడు సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. శ్రీలంక ఆరు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్ రెండు సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో 13 సార్లు ఆసియా కప్‌ను నిర్వహించారు. రెండు సార్లు టి20 ఫార్మాట్‌లో ఆసియాకప్ ట్రోఫీ జరిగింది. వన్డే ఫార్మాట్‌లో భారత్ ఆరు సార్లు విజేతగా నిలువగా, శ్రీలంక ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్ రెండు సార్లు ట్రోఫీని గెలుచుకుంది.
తొలి ట్రోఫీ టీమిండియాదే..
ఆసియాకప్‌లో తొలి ట్రోఫీని గెలిచిన రికార్డు టీమిండియాదే. 1984లో యుఎఇలో జరిగిన ఆసియాకప్‌లో భారత్ ట్రోఫీని సొంతం చేసుకుంది. షార్జాలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. 1986లో శ్రీలంక వేదికగా రెండో ఆసియాకప్ జరిగింది. ఇందులో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి లంక ఛాంపియన్‌గా నిలిచింది. 1988లో బంగ్లాదేశ్ వేదికగా మూడో ఆసియాకప్ ట్రోఫీని నిర్వహించారు. ఇందులో భారత్ ట్రోఫీని సాధించింది. ఫైనల్లో శ్రీలంక ఓటమి పాలైంది. 1990లో జరిగిన ఆసియాకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో కూడా భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంక మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 1995లో యుఎఇ వేదికగా ఆసియాకప్ ట్రోఫీని నిర్వహించారు. ఈ టోర్నీలో కూడా భారతే విజేతగా నిలువడం విశేషం. మరోసారి లంక రన్నరప్‌గా నిలిచింది. 1997లో జరిగిన ఆసియాకప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి భారత్ ఫైనల్లో ఓటమి చవిచూసింది. ఆతిథ్య శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకుంది.కాగా, 2000లో బంగ్లాదేశ్ వేదికగా ఆసియాకప్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ ట్రోఫీని దక్కించుకుంది. శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది.
2004లో శ్రీలంక వేదికగా ఆసియాకప్ నిర్వహించారు. ఇందులో లంక ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో భారత్‌ను ఓడించి లంక ట్రోఫీని దక్కించుకుంది. 2008లో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి లంకకు ట్రోఫీ దక్కింది. ఫైనల్లో భారత్ పరాజయం పాలైంది. 2010లో జరిగిన ఆసియాకప్‌కు శ్రీలంక వేదికగా నిలిచింది. ఈసారి భారత్ విజేతగా నిలిచింది. లంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2012లో బంగ్లాదేశ్ వేదికగా ఆసియాకప్ జరిగింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ట్రోఫీని సాధించింది. బంగ్లాదేశ్ రన్నరప్‌గా నిలువడం విశేషం. 2014లో కూడా బంగ్లాదేశ్‌లోనే ఆసియాకప్‌ను నిర్వహించారు. ఈసారి శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు 2016లో కూడా ఆసియాకప్ బంగ్లాదేశ్‌లోనే జరగడం విశేషం. అయితే ఈసారి ఆసియాకప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఇందులో భారత్ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక 2018లో జరిగిన ఆసియాకప్‌కు యుఎఇ ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి వన్డే ఫార్మాట్‌లో ట్రోఫీని నిర్వహించారు. భారత్ ట్రోఫీని గెలుచుకోగా బంగ్లాదేశ్ మరోసారి రన్నరప్‌గా నిలిచింది.
2022లో కూడా ఆసియాకప్ యుఎఇలోనే జరిగింది. ఈసారి టి20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ను నిర్వహించారు. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, 2023లో జరుగుతున్న ఆసియాకప్‌కు పాకిస్థాన్, శ్రీలంకకు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి జరిగే టోర్నీలో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. కాగా, ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా సనత్ జయసూర్య నిలిచాడు. జయసూర్య వన్డే ఫార్మాట్‌లో 1220 పరుగులు సాధించాడు. ఇక టి20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించి బ్యాటర్‌గా విరాట్ కోహ్లి భారత్ నిలిచాడు. విరాట్ ఈ ఫార్మాట్‌లో 429 పరుగులు సాధించాడు. ఇక ఆసియా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ నిలిచాడు. మురళీధరన్ 30 వికెట్లను తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 ఫార్మాట్‌లో భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 13 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఆసియాకప్‌లో శ్రీలంక అత్యధికంగా 34 మ్యాచుల్లో విజయం సాధించింది. టీమిండియా 31 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.