Friday, January 24, 2025

ఆసియాకప్‌కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి మెగా టోర్నీ, తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో శ్రీలంక ఢీ

దుబాయి : ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ క్రికెట్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. యుఎఇ వేదికగా శనివారం నుంచి ఆసియాకప్ జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పోటీ పడనున్నాయి. శనివారం జరిగే మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో శ్రీలంక తలపడనుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే అక్కడ పరిస్థితులుఅనుకూలంగా లేక పోవడంతో వేదికను యుఎఇకి మార్చారు. ఆసియాకప్‌లో ఈసారి హాంకాంగ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

మరోవైపు శ్రీలంక, భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా బరిలో ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్‌భారత్ ఒకే గ్రూపులో ఉన్నాయి. పసికూన హాంకాంగ్ కూడా ఈ గ్రూపులోనే ఉంది. ఇక ఆదివారం దాయాది జట్ల మధ్య పోరు జరుగనుంది. ఆసియాకప్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆసియాకప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఆసియాకప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కూడా ట్రోఫీపై కన్నేసింది. శ్రీలంక, అఫ్గాన్, బంగ్లాదేశ్ జట్లను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. కాగా ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్ ఫోర్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ సమరం సెప్టెంబర్ 11న జరుగుతుంది. ఈసారి ఆసియాకప్ రెండు వేదికల్లో జరుగనుంది. ఎక్కువ మ్యాచ్‌లు దుబాయి వేదికగా జరుగుతాయి.

మూడు మ్యాచ్‌లకు షార్జా ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకు దాసున్ శనకా, అఫ్గానిస్థాన్‌కు మహ్మద్ నబి, బంగ్లాదేశ్‌కు షకిబుల్ హసన్, టీమిండియాకు రోహిత్ శర్మ, పాకిస్థాన్‌కు బాబర్ ఆజమ్‌లు సారథ్యం వహిస్తున్నారు. ఇక ఆసియాకప్‌లో అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈసారి స్టార్ నెట్‌వర్క్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News