Monday, December 23, 2024

నేడు దాయాదుల మధ్య మరో పోరు

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో భారత్
పాకిస్థాన్‌కు పరీక్ష
నేడు దాయాదుల మధ్య మరో పోరు
దుబాయి: చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య సూపర్-4 సమరం జరుగనుంది. ఇప్పటికే లీగ్ దశలో ఇరు జట్లు తలపడ్డాయి. తాజాగా మరోసారి దాయాదులు తలపడనున్నాయి. లీగ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాకిస్థాన్ కనిపిస్తోంది. ఇక భారత్ కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగనుంది. లీగ్ దశ ఫలితాన్ని మరోసారి పునరావృతం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య వారం రోజుల్లోనే మరో పోరు జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కిందటి ఆదివారం ఇండోపాక్‌ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్4లో భాగంగా మరోసారి చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. ఇక అనుకున్నట్టు జరిగితే వచ్చే ఆదివారం జరిగే ఫైనల్లో కూడా భారత్‌పాకిస్థాన్‌లు ఫైనల్‌లో ఢీకొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే జరిగితే ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు పండగేనని చెప్పాలి. కాగా, ఇరు జట్లను గాయాల బాధ వెంటాడుతోంది. గాయం కారణంగా ఇరు జట్లకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. కిందటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అలరించిన రవీంద్ర జడేజా గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. పాకిస్థాన్ కూడా షాహిన్ అఫ్రిదితో సహాల పలువురు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. అయితే రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవ లేదనే చెప్పాలి. వారు సామర్థం మేరకు రాణిస్తే దాయాదిల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఆత్మవిశ్వాసంతో
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే కెఎల్ రాహుల్ ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ రాహుల్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్‌ను ఝులిపించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు.
అందరి కళ్లు వీరిపైనే
మరోవైపు హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విరాట్ కోహ్లి, సూర్యకుమార్‌లు టీమిండియాకు కీలకంగా మారాయి. కోహ్లి ఆడిన రెండు మ్యాచుల్లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక హాంకాంగ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌పై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిచితే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఇక రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య తదితరులతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక భువనేశ్వర్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్, అశ్విన్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం
కాగా, టి20లో ప్రమాదకర జట్టుగా పేరున్న పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. కిందటి మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ చివరి వరకు భారత్‌కు గట్టి పోటీనే ఇచ్చింది. ఇక హాంకాంగ్‌పై రికార్డు విజయం సాధించడంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈసారి మరింత మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ సమతూకంగా ఉంది. రిజ్వాన్, ఫకర్ జమాన్, కెప్టెన్ బాబర్, ఖుష్‌దిల్ షా, ఇఫ్తికార్ తదితరులతో పాక్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. అంతేగాక నవాజ్, షాదాబ్, నసీమ్, రవూఫ్‌లతో కూడా పటిష్టమైన బౌలింగ్ లైనప్ కూడా పాక్ అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

Asia Cup Super 4: IND vs PAK Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News