Thursday, December 19, 2024

ఫైనల్ బెర్త్ ఎవరిదో?.. నేడు లంకతో పాక్ ఢీ..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియాకప్ వన్డే టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. భారత్ చివరి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆతిథ్య జట్లు పాకిస్థాన్, శ్రీలంక జట్లకు ఇంకా ఫైనల్ బెర్త్‌లు ఖరారు కాలేదు. గురువారం జరిగే సూపర్4 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు దూసుకెళుతోంది. ఇటు పాకిస్థాన్ అటు శ్రీలంకలు భారత్ చేతిలో ఓడి ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో గురువారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకు చావోరేవోగా మారింది. ఇందులో గెలిచే జట్టుకే ఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇరు జట్లు కూడా మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకున్నాయి. ఇందులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రెండు ఉన్నాయి. అయితే పాకిస్థాన్‌ను గాయల సమస్య వెంటాడుతోంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు నసీమ్‌షా, హారిస్ రవూఫ్‌లు గాయం బారిన పడ్డారు. గాయాలతో ఇద్దరు టోర్నీకి దూరమయ్యారు.

రవూఫ్ ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించిన విషయం తెలిసిందే. అతని సేవలు కోల్పోవడం పాక్‌కు అతి పెద్ద దెబ్బగానే చెప్పాలి. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ సమస్యలు జట్టును వెంటాడుతున్నాయి. భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇటు బౌలర్లు, అటు బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో పాక్‌కు ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం తప్పలేదు. కిందటి మ్యాచ్లో ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌లతో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. షాదాబ్ ఖాన్, ఫహీం అశ్రఫ్‌లు కూడా సత్తా చాటలేక పోయారు. జట్టును ఆదుకుంటారని భావించిన ఆఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్‌లు కూడా నిరాశ పరిచారు. బౌలింగ్‌లో కూడా షహీన్ అఫ్రిది, షాదాబ్, ఫహీమ్, ఇఫ్తికార్‌లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇలాంటి స్థితిలో లంకతో జరిగే మ్యాచ్ వీరికి సవాల్‌గా మారింది. ఫైనల్‌కు చేరాలంటే పాకిస్థాన్ సమష్టిగా రాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫేవరెట్‌గా..
ఇక, లంక ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో పోల్చితే లంక కాస్త బలంగా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో అద్భుత ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన అసలంక, వెల్లలాగేపై లంక మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఓపెనర్లు పాథుమ్ నిసాంకా, కరుణరత్నెలు విఫం కావడం ఆందోళన కలిగిస్తోంది. కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, కెప్టెన్ దాసున్ శనక, వెల్లలాగేలతో లంక బలంగానే ఉంది. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం లంకకు పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News