కొలంబో : ఆసియాకప్ సూపర్4లో శ్రీలంక బోణీ కొట్టింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా 40 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50) అర్ధ సెంచరీతో అలరించాడు.
ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సమరవిక్రమ 72 బంతుల్లోనే 2 సిక్సర్లు, 8 బౌండరీలతో 93 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, హసన్ మూడేసి వికెట్లు తీశారు. షరిఫుల్‌కు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. తౌహిద్ (82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. లంక బౌలర్లలో తీక్షణ, శనక, పతిరణ మూడేసి వికెట్లు తీశారు.