Saturday, January 18, 2025

టీమిండియాకు తేలికేం కాదు..

- Advertisement -
- Advertisement -

క్రీడా విభాగం: వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరుగనున్న ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ కప్ టోర్నమెంట్ టీమిండియాకు చాలా కీలకంగా మారింది. సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్ ట్రోఫీకి భారత్ తగిన విధంగా సన్నద్ధం కాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మెగా టోర్నీ టీమిండియాకు సవాల్ వంటిదేనని వారు జోస్యం చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆతిథ్య టీమ్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. సీనియర్లు బుమ్రా, షమిలు ఈ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారా అంటే సందేహమేనని అంటున్నారు.

గాయాల కారణంగా బుమ్రా చాలా రోజుల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. షమిని కూడా విశ్రాంతి పేరిట కీలక సిరీస్‌లకు దూరంగా ఉంచారు. సిరాజ్ కూడా విండీస్ సిరీస్ మధ్యలో గాయపడ్డాడు. దీంతో అతను కూడా సిరీస్ మధ్యలోనే ఇంటికి వచ్చేయక తప్పలేదు. ఇక కీలక బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌లు గాయాలతో చాలా రోజుల పాటు టీమిండియాకు అందుబాటులో లేకుండా పోయారు. అయితే వీరిద్దరికి ఆసియాకప్‌లో ఆడే ఛాన్స్ లభించింది. పూర్తి ఫిట్‌నెస్‌తో లేని వీరు ఈ ఆసియాకప్‌లో ఎలా ఆడతారో చెప్పలేం.

కీలకమైన వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యగా మారింది. పలువురు ఆటగాళ్లు అంతంత మాత్రం ఫిట్‌నెస్‌తోనే ఉన్నారు. అంతేగాక చాలా మంది క్రికెటర్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపై జట్టు ఈసారి భారీ ఆశలు పెట్టుకుంది. విండీస్ సిరీస్‌లో వీరిద్దరూ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆసియా కప్‌లో మాత్రం బరిలోకి దిగనున్నారు.

వరుస ప్రయోగాలతోనే..
ఇక టీమిండియా పరిస్థితి ఇలా తయారు కావడానికి ముఖ్య కారణం వరుస ప్రయోగాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర జట్లు ఇలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండగా భారత్ మాత్రం ఇప్పటికీ ఇలాంటి విధానాన్నే అవలంభిస్తోంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగారు. వరల్డ్‌కప్ సమీపిస్తున్న సమయంలో సీనియర్లకు తగిన ప్రాక్టీస్ కల్పించాల్సిన స్థితిలో యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. సొంత గడ్డపై జరిగే మెగా టోర్నమెంట్‌పై అభిమానులకు భారీ ఆశలు ఉన్నాయి. అయితే ఈ వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆశించిన స్థాయిలో సిద్ధం కాకపోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News