మనీలా: ఫిలిప్సిన్ రాజధాని మనీలాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలో లక్ష్యసేన్ 12-21, 21-10, 21-19 తేడాతో లిషీ-పెంగ్(చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధు తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. పివి సింధు 18-21, 27-25, 21-9 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీకి చెందిన పి-యు-పో చేతిలో పోరాడి నెగ్గింది. మరో పోటీలో మాల్వీక బన్సోద్ 21-9, 17-21, 24-26తో యు-జి-మిన్ చేతిలో తృటిలో పరాజయంపాలైంది. మూడో గేమ్‌లో ఇరు వురు షట్లర్లు పోటాపోటీగా తలపడ్డారు.
హోరాహోరీగా సాగిన మరో గేమ్‌లో సైనా నెహ్వాల్ 21-15, 17-21, 21-13 తేడాతో కొరియాకు చెందిన సీమ్-యు-జిన్‌పై పోరాడి నెగ్గింది. ఇక టాప్‌సీడ్ కెంటో మొమొటో 21-17, 17-21, 7-21తేడాతో ఇండోనేషియాకు చెందిన చికొ-అరో చేతిలో ఓడిపోయాడు. పురుషుల విభాగంలో జరిగిన మరో గేమ్‌లో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లో అడుగు పెట్టాడు. మలేషియాకు చెందిన ఎన్‌జి యోంగ్‌తో తలపడిన శ్రీకాంత్ 22-20, 21-15తో వరుస సెట్‌లలో గెలుపొంది, గేమ్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
Asian Championship 2022: PV Sindhu enters 2nd round