Friday, November 22, 2024

ఆసియా క్రీడలు వాయిదా!

- Advertisement -
- Advertisement -

Asian Games postponed!

బీజింగ్: చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రువారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు హాంగ్జౌ నగరంలో ఈ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చైనాలో పరిస్థితులు క్రీడల నిర్వహణకు అనుకూలంగా లేవని దీంతో పోటీలను వాయిదా వేయక తప్పడం లేదని ఆ మీడియా పేర్కొంది. మరోవైపు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక ఈ క్రీడలు తిరిగి ఎప్పుడూ నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్టామని కౌన్సిల్ వివరించింది.

కాగా షాంఘై నగరానికి సమీపంలో ఉన్న హాంగ్జౌలో ఆసియా క్రీడల నిర్వహణ కోసం చైనా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. క్రీడల కోసం దాదాపు 56 వేదికలను కూడా నిర్మించారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన క్రీడా సంగ్రామంగా ఆసియా గేమ్స్ పేరు తెచ్చుకొంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ క్రీడలను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మధ్య పతకాల కోసం తీవ్ర పోటీ ఉంటోంది. భారత్ కూడా కొన్నేళ్లుగా ఆసియా క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. పలు క్రీడాంశాల్లో పతకాల పంట పండిస్తోంది. ఈసారి కూడా పతకాల పంట పండించేందుకు భారత్ క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. దీని కోసం ఇప్పటికే పలు క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.

కరోనా భయంతోనే?

మరోవైపు ఇటీవల కాలంలో చైనా కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. ఇప్పటికే పలు నగరాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నారు. కఠిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చైనాలో ప్రతిరోజు వేలాది కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి స్థితిలో ఆసియా క్రీడల వంటి మెగా పోటీలను నిర్వహిస్తే పరిస్థితులు మరింత చేయిదాటే అవకాశం ఉంది. దీంతో పోటీలను తాత్కాలికంగా వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News