పాకిస్థాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) సహ వ్యవస్థాపకుడు ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం ఎన్నికయ్యారు. జర్దారీ పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.పిపిపి, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్( పిఎంఎల్‌ఎన్) సంయుక్తంగా పాక్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికార కూటమి తరఫున 68 ఏళ్ల జర్దారీ అధ్యక్ష పదవికి బరిలో నిలిచారు. జర్దారీకి ప్రత్యర్థిగా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ పార్టీకి చెందిన 75 ఏళ్ల మహమూద్ ఖాన్ అచక్‌జాయ్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. రాజ్యాంగం ప్రకారం నేషనల్ కౌన్సిల్, నాలుగు ప్రొవెన్షియల్ అసెంబ్లీలకు కొత్తగా ఎన్నికయిన సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
జర్దారీకి 255 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థికి 119 ఓట్లు వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. వ్యాపారంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన జర్దారీ దివంగత పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త. పాకిస్థాన్ 13వ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ పదవీ కాలం గత ఏడాదితో ముగియడంతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జర్దారీ గతంలో 2008నుంచి 2013 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడంతో అధ్యక్ష ఎన్నికలు కూడా ఆలస్యమయ్యాయి. కొత్త ఎలక్టోరల్ కాలేజి ఏర్పాటయిన తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.