హైదరాబాద్ : అద్భుతం.. మహాద్భుతం… అసోలా వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించడం అద్భుతమైన అనుభవం. పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడంలో వారి అచంచలమైన నిబద్ధత కోసం ఢిల్లీ ప్రభుత్వానికి వందనాలని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మొత్తంగా 37.74 చ.కి.మీతో అభయారణ్యం విస్తరించి ఉందని వెల్లడించారు. 240 పక్షి జాతుల నుండి 8 అద్భుతమైన చిరుతపులులు, లంగూర్స్, 80 సీతాకోకచిలుక జాతులు, అందమైన నీల్‌గైస్‌లతో పాటు, ఇది వన్యప్రాణుల స్వర్గాన్ని తలపిస్తోందని, మన అందర్నీ మంత్రముగ్ధులను చేస్తుందని ఎంపి సంతోష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జీవ వైవిధ్యానికి స్వర్గధామం : ఎంపి జైరాం రమేష్
జీవవైవిధ్యానికి స్వర్గధామం అసోలా వన్యప్రాణుల అభయారణ్యం అని ఎంపి జైరాం రమేష్ అన్నారు. ప్రకృతి అందాలు, పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు ఇది దర్పణంగా నిలుస్తోందన్నారు. ఈ స్వర్గధామంను దర్శించడం తనకెంతో అనుభూతిని కలిగించిందన్నారు. ఈ అభయారణ్యాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడంలో ఢిల్లీ ప్రభుత్వ నిబద్ధతను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ విషయాలన్నింటినీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.