Thursday, January 23, 2025

కస్టడీలో చిత్రహింసలు: బాధితుల పళ్లు పీకేసిన ఎఎస్‌పి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఒక కేసులో వైరి పక్షంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులను బలమైన ఆయుధంతో పళ్లు రాలగొట్టడంతోపాటు వారి వృషణాలను చిదిమి చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రం పోలీసు డివిజన్‌కు చెందిన ఎఎస్‌పి(ఐపిఎస్) బల్వీర్ సింగ్‌పై సబ్ కలెక్టర్-సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చేత విచారణకు జిల్లా కలెక్టర్ కెపి కార్తియేయన్ ఆదేశించారు.

2020 బ్యాచ్‌కి చెందిన ఐపిఎస్ అధికారి అయిన బల్వీర్ సింగ్ ఐఐటి బాంబేలో బిఇ చేశారు. 2022 అక్టోబర్ 15న అంబసముద్రం ఎఎస్‌పిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఒక ప్రేమ వ్యవహారంలో ఘర్షణ పడినందుకు, డబ్బులు వడ్డీకి ఇచ్చినందుకు, సిసిటివి కెమెరాలు పగలగొట్టినందుకు, భార్యాభర్తల మధ్య గొడవలో తలదూర్చినందుకు 10 మందిపై కేసులు నమోదు చేయగా తమను బల్వీర్ సింగ్ కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఆ 10 మంది నిందితులు ఆరోపించారు.

బాధితులలో ఒకరైన చెల్లప్ప ఈనే యువకుడి కథనం ప్రకారం..ఒక ప్రేమ వ్యవహారంపై తాను, తన సోదరులు, ముగ్గురు బంధువులు మరో గ్రూపుతో గొడవపడ్డామని అతను చెప్పాడు.. అవతలి గ్రూపునకు చెందిన సభ్యులను, వారి వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించి వారిపైన ఫిర్యాదు చేశామని అతను తెలిపాడు. తమలో ఆరుగురిని, అవతలి గ్రూపులో ముగ్గురిని పోలీసులు అంబసముద్రం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారని చెల్లప్ప ఇద్దరు కానిస్టేబుల్స్ తనను గట్టిగా పట్టుకోగాచెప్పాడు.

షార్ట్ ధరించి, చేతికి గ్లవుజ్ వేసుకుని తమ వద్దకు వచ్చిన ఎఎస్‌పి బల్వీర్ సింగ్ నీలం రంగులో ఉన్న ఒక బలమైన వస్తువుతో తన పళ్లపై గట్టిగా కొట్టాడని అతను తెలిపాడు. తన నోట్లో రాళ్లు వేసి మొహంపై బలంగా కొట్టాడని, దీంతో తన నోరు రక్తంతో నిండిపోయిందని చెల్లప్ప వివరించాడు. తన సోదరులు ఇద్దరిని, మరో ముగ్గురు బంధువులను కూడా అదే విధంగా మొహంపై కొట్టి కటింగ్ ప్లేయర్‌తో పళ్లు పీకివేశాడని అతను చెప్పాడు. తన సోరులలో ఒకరికి మూడు పళ్లు పోయాయని అతను చెప్పాడు. తన సోదరులలో ఒకడైన మరియప్పన్‌ను కూడా కొట్టడం ప్రారంభించగా అతనికి కొత్తగా పెళ్లయిందని, అతని వదిలివేయాలని తాము ఏడుస్తూ అర్థించామని చెల్లప్ప చెప్పాడు. మేమామాట చెప్పగానే కొట్టడం ఆపేసిన ఎఎస్‌పి అతడి వృషణాలను ఎడమ చేతితో గట్టిగా పిసికివేయడంతోపాటు గుండెపై కాలితో బలంగా తన్నాడని అతను చెప్పారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరియప్పన్ మంచానికే పరిమితమైపోయాడని అతను చెప్పాడు. అవతలి గ్రూపునకు చెందిన ముగ్గురు వ్యక్తులను కూడా ఎఎస్‌పి చిత్రహింసలకు గురిచేశాడని, వారి పళ్లు కూడా కటింగ్ ప్లేయర్‌తో పీకివేశాడని అతను తెలిపాడు. తమ వైపున ఆరుగురు, అవతలి గ్రూపునకు చెందిన ఇద్దరు వ్యక్తులు మొత్తం ఎనిమిది మంది ఎఎస్‌పి చేతిలో పళ్లు రాలగొట్టుకున్నామని అతను చెప్పాడు. అండర్‌వేర్‌లపైన తమను కూర్చోపెట్టి లాఠీలతో చితకబాదారని కూడా అతను చెప్పాడు. ఈ విషయాన్ని జుడిషియల్ మెజిస్ట్రేట్‌కు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బైకుపై నుంచి పడ్డామనో, కొబ్బరి చెట్టుపై నుంచి పడ్డామనో చెప్పాలని బెదిరించారని అతను తెలిపాడు.

ఈ సంఘటనపై న్యాయవాది, నేతాజీ సుభాష్ సేన నాయకుడు మహారాజన్ స్పందిస్తూ ఇప్పటివరకు 40 మంది వ్యక్తుల పళ్లను ఎఎస్‌పి బల్వీర్ సింగ్ తొలగించాడని ఆరోపించారు. 17 మంది వివరాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. బల్వీర్ సింగ్‌ను డిస్మిస్ చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై అధికారిక విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారని తిరునల్వేలి ఎస్‌పి శరవణన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News